మచిలీపట్నంఅర్బన్: ఎస్‌ఎస్‌సీ జవాబు పత్రాల మూల్యాంకనం ఏడవ రోజు ఆదివారం ప్రశాంతంగా కొనసాగిందని జిల్లా విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బారావు తెలిపారు. మొత్తం 775 మంది సిబ్బందిలో 80 మంది చీఫ్ ఎగ్జామినర్స్, 461 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్స్, 234 మంది సబ్జెక్ట్ అసిస్టెంట్లు మూల్యాంకన కార్యక్రమంలో పాల్గొన్నారని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రక్రియ సజావుగా సాగుతోందన్నారు. మిగిలిన మూల్యాంకనాన్ని ఈ నెల 15వ తేదీ వరకు పూర్తి చేయనున్నట్లు చెప్పారు.
గుడ్లవల్లేరు: మండలంలోని డోకిపర్రు మహాక్షేత్రంలోని శ్రీ భూసమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పుత్రకామేష్టి యాగాన్ని ఆదివారం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(మెయిల్) అధినేత, దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్తలు పురిటిపాటి వేంకట కృష్ణారెడ్డి, సుధారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ యాగానికి అపూర్వ స్పందన లభించింది. వేలాది మంది భక్తులు విచ్చేశారు. నిర్వాహకులు కొమ్మారెడ్డి బాపిరెడ్డి, విజయ భాస్కరమ్మ దంపతులు భక్తుల సౌకర్యార్ధం ప్రసాదం, మంచినీరు, అన్న ప్రసాదాల ఏర్పాట్లను చేపట్టారు. ఉదయం తొమ్మిది గంటలకు యాగం ప్రారంభమైంది. సంతానం లేని దంపతులు ఈ యాగంలో అధికసంఖ్యలో వేలాదిగా పాల్గొని శ్రీ వేంకటేశ్వరుని కృపకు పాత్రులయ్యారు. స్వామివారి సన్నిధిలో ప్రతి ఏడాది ఏప్రిల్ నెల రెండో ఆదివారం ఈ యాగం నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి ఖమ్మం జిల్లాకు చెందిన భక్తులు ఆదివారం రూ.1.28 లక్షల విరాళాన్ని అందజేశారు. ఖమ్మం జిల్లా మధిరకు చెందిన జయలక్ష్మి, వంశీకృష్ణ కుటుంబం ఆదివారం అమ్మవారి దర్శనానికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసిన వారు అమ్మవారి నిత్యాన్నదానానికి రూ.1.28,166 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.


