అవగాహనతోనే సైబర్ నేరాలకు చెక్
పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రస్తుతం సైబర్ క్రైమ్ పెనుసవాల్‌గా మారిందని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు అన్నారు. పోలీసు శాఖాపరంగా ఎన్ని చర్యలు తీసుకుంటున్నా నేరగాళ్లు కొత్తకొత్త ఎత్తులు వేస్తున్నారని, వారి బారిన పడకుండా ప్రజల్లో అవగాహన పెంచుకోవాలని సూచించారు. కమిషనరేట్‌లోని తనచాంబర్‌లో శనివారం ఆయన సైబర్ నేరాల నివారణపై బ్యాంకు ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా సీపీ ఎస్‌వీ రాజశేఖరబాబు మాట్లాడుతూ సైబర్ నేరాల నియంత్రణ కోసం ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో ఏ ఒక్కరూ సైబర్ నేరాల బారిన పడకుండా ఉండాలనే ఆలోచనతో సైబర్ సురక్ష కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్ట్ వంటి నేరాలు నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందన్నారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తేనే సైబర్ క్రైంను నిరోధించగలమన్నారు. డిజిటల్ అరెస్టు, సైబర్ నేరాలు చోటుచేసుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అన్ని బ్యాంకుల అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. డిజిటల్ అరెస్టుల బారిన పడకుండా ముందుగా తెలుసుకునే విధానం, పోలీసులకు రిపోర్టుచేసేందుకు పాటించాల్సిన సూచనలను తెలియజేశారు. ఇందుకు వినియోగించే వెబ్‌సైట్‌పై బ్యాంకు సిబ్బందికి అవగాహన కల్పించారు. సైబర్ నేరాలను నిరోధించే కార్యక్రమంలో బ్యాంకర్లు అందరూ భాగస్వాములయ్యేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు. సమావేశంలో సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణప్రసన్న, ఏసీపీ రాజశేఖర్, ఇన్‌స్పెక్టర్లుశ్రీనివాస్, శివాజీ, వివిధ బ్యాంకుల నుంచి వచ్చిన 120మంది సిబ్బంది పాల్గొన్నారు.


