కేబుల్ సిబ్బందిపై దాడిచేసిన యువకుల అరెస్ట్
కోనేరుసెంటర్(మచిలీపట్నం): మద్యం మత్తులో సిటీకేబుల్ సిబ్బందిపై దాడికి పాల్పడిన ముగ్గురు యువకులకు కృష్ణా జిల్లా పోలీసులు స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు. వారిని నడిరోడ్డుపై నడిపించుకుంటూ స్టేషన్‌కు తీసుకెళ్లారు. వివరాల్లోకి వెళితే..స్థానిక బలరామునిపేటకు చెందిన వల్లెపు వెంకటేష్, వల్లెపు ఏసు, వల్లెపు సాయి అన్నదమ్ముల పిల్లలు. ఈ ముగ్గురు శనివారం రాత్రి మద్యం మత్తులో సిటీ కేబుల్ సిబ్బందిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. వాచ్‌మన్‌గా పనిచేసే వృద్ధుడు చలపతిని చితకబాదారు. అడ్డువెళ్లిన మరో ఇద్దరు సిబ్బంది సాయి, సుబ్బారావుపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. అక్కడితో ఆగకుండా కార్యాలయంలోకి వెళ్లిన సిబ్బందిని వెంటాడి దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ ఏసుబాబు ఆదివారం ముగ్గురు నిందితులను బలరామునిపేటలో అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్ వరకు నడిరోడ్డుపై నడిపించుకుంటూ తీసుకువెళ్లారు. పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వెంకటేష్, ఏసుపై రౌడీషీట్లు ఓపెన్ చేస్తున్నట్టు సీఐ తెలిపారు.


