టెక్నాలజీ సమర్థ వినియోగంతో మెరుగైన సేవలు
ఎన్టీఆర్ జిల్లా సీపీ రాజశేఖరబాబు
లబ్బీపేట(విజయవాడతూర్పు): టెక్నాలజీని పోలీసుల పనిలో సమర్థంగా ఉపయోగించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు అన్నారు. నేరస్తులకు శిక్షలు పడేలా టెక్నాలజీని ఉయోగించి ఆధారాలు ఎలా సేకరించాలనే అంశంపై ఎన్టీఆర్ జిల్లా పోలీసులకు మూడు రోజుల శిక్షణ తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ శిక్షణలో 130 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొనగా, ఢిల్లీ నుంచి వచ్చిన సైబర్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్ డైరెక్టర్ డాక్టర్ ప్రసాద్ పాటిబండ్ల, ఇతర నిపుణులతో కలిసి అవగాహన కల్పించారు. ముఖ్యంగా సైబర్ క్రైమ్‌తో పాటు సోషల్ మీడియా కేసుల్లో ఆధారాలు సేకరించి శిక్షలు పడేలా చర్యలు తీసుకోవడంపై ఈ శిక్షణ కొనసాగుతోంది.
అనుమానాలు నివృత్తి చేసుకోవాలి..
సీపీ రాజశేఖరబాబు మాట్లాడుతూ దర్యాప్తులో కీలక ఆధారాలు సేకరించడానికి అవసరమైన అన్నీ విషయాలను తెలుసుకోవాలని, ఏమైనా అనుమానాలు ఉంటే వెంటనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీసీపీలు షిరీన్‌బేగం, కేజీవీ సరిత, కె. తిరుమలేశ్వరరెడ్డి, కృష్ణప్రసన్న, ఏబిటీఎస్ ఉదయరాణి, ఎస్‌వీడీ ప్రసాద్, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్‌లు, సైబర్ క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆస్తి వివాదాలపై ఫిర్యాదులే అధికం
పోలీస్ గ్రీవెన్స్‌లో 77 అర్జీలు స్వీకరణ
లబ్బీపేట(విజయవాడతూర్పు): జిల్లాలో ఆస్తి, భూ వివాదాలు, నగదు లావాదేవీల్లో గొడవలు పెరుగుతున్నాయి. అందుకు ప్రతి సోమవారం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో నిర్వహించే గ్రీవెన్స్‌కు వచ్చే ఫిర్యాదులే నిదర్శనంగా నిలుస్తున్నారు. ప్రతి వారం వచ్చే ఫిర్యాదుల్లో అత్యధికంగా ఇలాంటివే ఉంటున్నాయి. కాగా సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(గ్రీవెన్స్)లో 77 ఫిర్యాదులు రాగా, వాటిలో 44 ఆస్తి తగాదాలకు సంబంధించినవే ఉన్నాయి. కాగా పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఎస్‌వీడీ ప్రసాద్, ఏడీసీపీ ఎం. రాజారావు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా నడవలేని వికలాంగులు, వృద్ధుల వద్దకే వెళ్లి, వారు సమస్యను తెలుసుకుని, ఫిర్యాదులు అందుకున్నారు. ఆయా ఫిర్యాదులపై సంబంధిత ఎస్‌హెచ్‌ఓలతో మాట్లాడి సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. మొత్తం అర్జీలు 77 రాగా, వాటిలో ఆస్తి, భూమి, నగదు లావాదేవీలకు సంబంధించినవి 44, కుటుంబ కలహాలపై 5, వివిధ మోసాలపై 1, మహిళా సంబంధిత నేరాలపై 8, వేర్వేరు సమస్యలు, సంఘటనలపై 19 ఫిర్యాదులు వచ్చాయి.
ఉరి వేసుకుని మార్బుల్ కార్మికుడి ఆత్మహత్య
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): మద్యానికి బానిసైన మార్బుల్ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేట పోతిన అప్పలస్వామి వారి వీధిలో రాంపిళ్ల శ్రీలక్ష్మి, బాబి దంపతులు నివాసం ఉంటున్నారు. బాజీ మార్బుల్ పని చేస్తుంటాడు. గత కొంత కాలంగా మద్యం అతిగా తాగడమే కాకుండా భార్యను వేదింపులకు గురి చేయసాగాడు. 15 రోజుల కిందట బాగా మద్యం తాగి వచ్చిన బాబి భార్యను, తల్లిని వేదించడంతో వారు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయారు. సోమవారం ఉదయం చుట్టు పక్కల వారు శ్రీలక్ష్మికి ఫోన్ నుంచి ఇంటి నుంచి దుర్వాసన వస్తోందని చెప్పారు. దీంతో ఇంటికి వచ్చి చూడగా, సీలింగ్ ఫ్యాన్‌కు బాబి ఉరి వేసుకుని శవమై కనిపించాడు. శ్రీలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
టెక్నాలజీ సమర్థ వినియోగంతో మెరుగైన సేవలు
టెక్నాలజీ సమర్థ వినియోగంతో మెరుగైన సేవలు


