నెల్లూరు మేయర్ ఎస్టీ మహిళకే ఇవ్వాలి
గిరిజన ప్రజా సంఘాల జేఏసీ డిమాండ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): చంద్రబాబు ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ పాలన సాగిస్తోందని గిరిజన ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు మానుపాటి నవీన్ ఆరోపించారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగంలో ఎస్టీలకు కల్పించిన హక్కులకు చంద్రబాబు ప్రభుత్వం గండికొడుతోందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ గత ప్రభుత్వం నెల్లూరు మేయర్ పదవిని గిరిజన మహిళకు కట్టబెట్టి కొనసాగించిందన్నారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో గిరిజన మహిళపై దాడులు పెరగడంతో నెల్లూరు మేయర్ తన పదవికి రాజీనామా చేశారని ఆరోపించారు. తక్షణమే నెల్లూరు మేయర్ పదవిని ఎస్టీ మహిళతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో గిరిజన సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. సమావేశంలో ఏవైహెచ్‌పీఎస్ జాతీయ అధ్యక్షుడు ఎన్.ధర్మ, జేఏసీ నేతలు పాల్గొన్నారు.


