మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): బాలికల సంరక్షణపై సమస్య వచ్చిన తర్వాత పరిష్కారాలు వెతకడం కంటే, అలాంటివి తలెత్తకముందే కట్టుదిట్టమైన నివారణ చర్యలను చేపట్టాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, సీ్త్ర శిశు సంక్షేమశాఖ కార్యదర్శి ఎ.సూర్యకుమారి అన్నారు. బెంజిసర్కిల్ సమీపంలోని ఓ హోటల్‌లో మహిళాభివృద్ధి, సీ్త్ర శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మంగళవారం ప్రాంతీయ స్థాయిలో బాలికల సంరక్షణ, మానవ అక్రమ రవాణా నిరోధంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిఽథిగా పాల్గొన్న ఎ.సూర్యకుమారి మాట్లాడుతూ కుటుంబ వ్యవస్థలో వస్తున్న మార్పులు, సోషల్ మీడియా ప్రభావం వల్ల యువత తప్పుదారిలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు, పిల్లల భద్రతకు టోల్ ఫ్రీ నంబర్ 112, వన్–స్టాప్ సెంటర్స్ ద్వారా అత్యవసర సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అనంతరం సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా బాధితుల దయనీయ పరిస్థితిని వివరించారు. మిషన్ వాత్సల్య జాయింట్ డైరెక్టర్ ఎం.శిరీష, మిషన్ శక్తి జాయింట్ డైరెక్టర్(ఇన్‌చార్జ్) ఎస్.నాగ శైలజ, జాయింట్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఎస్.సునంద తదితరులు పాల్గొన్నారు.


