ఫ్లైయాష్ ప్రశ్నార్థకం!
ఎన్టీటీపీఎస్ అధికారుల తీరుతో బూడిద కొరత దిక్కుతోచని స్థితిలో బ్రిక్స్ కంపెనీల యజమానులు కృత్రిమ కొరత సృష్టించి సొమ్ము చేసుకుంటున్న అధికారులు రెండు వేల బ్రిక్స్ కంపెనీల్లో నిలిచిపోనున్న ఉత్పత్తి
ఆ అధికారి ధన దాహమే కారణమా?
మూసివేత దిశగా ఫ్లైయాష్ బ్రిక్స్ కంపెనీలు
ఇబ్రహీంపట్నం: ఎన్టీటీపీఎస్ అధికారుల తీరుతో ఫ్లైయాష్ బ్రిక్స్ కంపెనీలు మూతపడే దశకు చేరుతున్నాయి. ఎన్టీటీపీఎస్ సంస్థలో విద్యుత్ ఉత్పత్తి అనంతరం విడుదలయ్యే మెత్తటి బూడిదను ఫ్లైయాష్ బ్రిక్స్ కంపెనీలకు రవాణా చేయాల్సి ఉంది. గతంలో 20శాతం బూడిద బ్రిక్స్ కంపెనీలకు ఇవ్వాలనే ఉత్తర్వులు ప్రభుత్వాలు ఇచ్చాయి. అయితే ఎన్టీటీపీఎస్ అధికారులు బూడిద కృత్రిమ కొరత సృష్టించి బ్రిక్స్ కంపెనీలకు రవాణా కాకుండా అడ్డుకుంటున్నట్లు ఆయా కంపె నీల యజమానులు ఆరోపిస్తున్నారు. గతంలో ఉచితం, ఆ తర్వాత రూ.50 చొప్పున కొనుగోలు చేసిన కంపెనీల యజమానులు ఇప్పుడు లారీ రూ.10వేలు చెల్లించి బూడిద లోడింగ్ చేసుకుంటున్నారు. గతంలో రోజుకు 100లారీలు బూడిద లోడింగ్ జరిగితే ఇప్పుడు నెలకు 100లారీలు లోడింగ్ అవడం కష్టంగా మారింది. ఇదే మాదిరిగా కొనసాగితే ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు వివిధ జిల్లాల్లోని సుమారు 2వేల ఫ్లైయాష్ బ్రిక్స్ కంపెనీలు మూతపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ ప్రైవేటు కంపెనీకి బూడిద లోడింగ్ కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల ఆ ప్రభావం బ్రిక్స్ కంపెనీలపై పడుతున్నట్లు తెలుస్తోంది.
ఫ్లైయాష్‌పైనే ఆధారం..
గ్రామాలు, పట్టణాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాల వారు గృహ నిర్మాణాల కోసం ఫ్లైయాష్ బ్రిక్స్ ఎక్కువగా వినియోగిస్తారు. ఈ నేపథ్యంలో జిల్లాలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలుగా బ్రిక్స్ కంపెనీలు అనేక ప్రాంతాల్లో నెలకొల్పారు. అపార్ట్‌మెంట్లు, గృహాలు, ప్రభుత్వ కార్యాలయాలు బ్రిక్స్‌తో నిర్మాణం జరుపుతుంటారు. బ్రిక్స్ కంపె నీలు గతంలో బూడిద టన్ను రూ.30 చొప్పున కొనుగోలు చేసేవి. ఆ తర్వాత కాలంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో టన్ను రూ.50 చొప్పున కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఇటీవల కాలంలో ఎన్టీటీపీఎస్ బూడిద రవాణా ప్రైవేట్ సంస్థకు అప్పగించడంతో అధికారులు కృత్రిమ కొరత సృష్టించి లారీ బూడిద రూ.10వేలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని బ్రిక్స్ కంపెనీలు యజమానులు ఆరోపిస్తున్నారు. గతంలో రోజుకు 100లారీలు లోడింగ్ అయ్యేవని, ఇప్పుడు కొరత సృష్టించడం వల్ల నెలకు 100 లారీలు లోడింగ్ అవడం కష్టంగా మారిందని చెబుతున్నారు.
ఉచితంగా ఇచ్చిన వైఎస్సార్..
30ఏళ్ల క్రితం 1996లో ఫ్లైయాష్ బ్రిక్స్ కంపెనీలకు టన్ను రూ.30 చొప్పున ఎన్టీటీపీఎస్ ప్లాంట్ నుంచి బూడిద సరఫరా జరిగేది. ఆ తరువాత 2004లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిని ఫ్లైయాష్ బ్రిక్స్ కంపెనీ ప్రతినిధులు కలిసి టన్ను బూడిద రూ.30చొప్పున కొనుగోలు చేయలేకపోతున్నామని, ఫ్లైయాష్ ఉచితంగా ఇప్పించాలని లిఖిత పూర్వకంగా కోరారు. ఆయన మంచి మనసుతో బ్రిక్స్ కంపెనీలకు ఉచితంగా ఫ్లైయాష్ ఇవ్వాలని ఎన్టీటీపీఎస్ సంస్థకు ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత కాలంలో కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకు టన్ను రూ.50 చొప్పున ఫ్లైయాష్ బ్రిక్స్ కంపెనీలకు బూడిద అమ్మాలని సంస్థ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. టన్ను రూ.50 చొప్పున ఇప్పటి వరకు కొనుగోలు చేసి కంపెనీలను నడపగలిగారు.
30ఏళ్లుగా ఎన్నో వ్యయప్రయాసలు, కష్టనష్టాలు భరించి నిలబడిన ఫ్లైయాష్ బ్రిక్స్ కంపెనీల పరిస్థితి చంద్రబాబు ప్రభుత్వంలో ఒడిదొడుకులకు గురవుతోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఫ్లైయాష్ కంపెనీలకు యాష్ ఇవ్వకుండా కృత్రిమ కొరత సృష్టించడంతో సుమారు రెండు వేల ఫ్లైయాష్ బ్రిక్స్ కంపెనీలు మూత పడే పరిస్థితులు నెలకొన్నాయి. 2024 వరకు చిన్న మధ్య తరహా పరిశ్రమలుగా ఏర్పడిన యాష్ బ్రిక్స్ కంపెనీలకు రోజుకి సుమారు వంద లారీల ఫ్లైయాష్ ఎన్టీటీపీఎస్ ప్లాంట్ నుంచి సరఫరా జరిగేది. దాని వల్ల ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు పరిసర జిల్లాల్లోని సుమారుగా రెండు వేల కంపెనీలు నడిచేవి. ఒక్కొక్క బ్రిక్స్ కంపెనీ మీద ఆధారపడి యాభై మంది కార్మికులకు జీవనోపాధి లభించేది. ఇప్పుడు ఎన్టీటీపీఎస్‌కు చెందిన ఓ అధికారి ధన దాహానికి బ్రిక్స్ కంపెనీలు మూత పడే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆ అధికారి లారీకి రూ.10వేలు చొప్పున వసూలు చేసి నగదులో స్థానిక టీడీపీ నాయకులు సైతం వాటాలు తీసుకుంటున్నారని బ్రిక్స్ కంపెనీల యజమానులు ఆరోపిస్తున్నారు. ఇదే ఫ్లైయాష్ బ్రిక్స్ కంపెనీల ప్రతినిధులు 2018లో అమరావతి రాజధాని నిర్మాణం కోసం సాక్షాత్తూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకి రూ.15లక్షలు చెక్కు అందజేశారు. నేడు అదే ఫ్లైయాష్ బ్రిక్స్ కంపెనీలు అదే టీడీపీ నాయకుల, అధికారుల ధన దాహానికి మూత పడే పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే ప్రత్యక్ష బ్రిక్స్ కంపెనీల యజమానులు ఆందోళనకు సిద్ధమవుతామని ప్రకటించారు.


