ఐదు రోజుల పనిదినాల కోసం డిమాండ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకుల్లో ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) డిమాండ్ చేసింది. సోమవారం విజయవాడ అలంకార్ సెంటర్‌లోని ధర్నా చౌక్ నందు యూఎఫ్‌బీయూ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజధానుల్లో చేపట్టిన జాతీయ ఆందోళనలో భాగంగా ఈ ధర్నాను నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న ఆలిండియా స్టేట్ బ్యాంక్ స్టాఫ్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఎల్. చంద్రశేఖర్ మాట్లాడుతూ 12వ ద్వైపాక్షిక ఒప్పందం, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌తో కుదిరిన ఒప్పందం నేటి వరకు అమలు కాలేదన్నారు. ఇంతకన్నా దురదృష్టకరమైన విషయం మరొకటి లేదన్నారు. రెండేళ్ల క్రితం కేంద్ర ఆర్థిక శాఖ త్వరలోనే బ్యాంకుల్లో ఐదు రోజుల పనిదినాలు ప్రవేశపెడుతున్నామని ప్రకటించి మాట తప్పిందన్నారు. ఇప్పటికే ఎల్‌ఐసీ, జీఐసీ, ఆర్బీఐలో ఐదు రోజుల పని దినాలను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం.. బ్యాంకుల్లో మాత్రం అమలు చేయలేకపోవడం ఎంతో దురదృష్టకరమన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు ఈనెల 27న దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. స్టేట్ బ్యాంక్ ఆఫీసర్ల అసోసియేషన్ అధ్యక్షుడు వి. విజయ శేఖర్, నాయకులు, బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు.
కుటుంబ కలహాలతో
వ్యక్తి బలవన్మరణం
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): కుటుంబ కలహాల నేపథ్యంలో వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఘటనపై మృతుని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేట కుమ్మరి వీధి 5వ లైన్‌లో బొట్టా రాజేంద్రకుమార్ తన భార్య, ఇద్దరు ఆడపిల్లలతో నివాసం ఉంటున్నాడు. అదే భవనంలో కింది అంతస్తులో రాజేంద్రకుమార్ తమ్ముడు నాగేంద్ర తేజత్‌కుమార్ తన భార్య శైలజకుమారితో నివాసం ఉంటున్నాడు. కొంత కాలంగా రాజేంద్రకుమార్‌కు తన భార్యతో గొడవ పడుతుండటంతో ఆమె పిల్లలను తీసుకుని కృష్ణలంకలోని పుట్టింటికి వెళ్లిపోయింది. సోమవారం ఉదయం రాజేంద్రకుమార్ ఇంట్లో ఉండగా, తమ్ముడు నాగేంద్ర భోజనం తీసుకుని గదికి వెళ్లాడు. అయితే ఇంటి తలుపులు వేసి ఉండటంతో కిటికీలో నుంచి చూడగా, రాజేంద్రకుమార్ వేలాడుతూ కనిపించాడు. దీంతో నాగేంద్ర చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు బలవంతంగా తెరిచి లోపలకు వెళ్లి చూడగా సీలింగ్ ఫ్యాన్‌కు ఉయ్యాల కట్టే ప్లాస్టిక్ తాడుతో ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.


