వివాహిత దారుణ హత్య
మైలవరం: మండల కేంద్రం రెడ్డిగూడెం శివారు రాఘవాపురంలో సంగెపు శ్రావణి(30) అనే వివాహిత ఆదివారం రాత్రి హత్యకు గురైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. సంగెపు శ్రావణి అనే వివాహిత విస్సన్నపేటలో ఒక వస్త్రాల దుకాణంలో పనిచేస్తోంది. యథావిధిగా ఆదివారం తను విధులు ముగించుకుని రాత్రి పదకొండు గంటల సమయంలో మరో వ్యక్తి సాయంతో ఇంటికి చేరుకున్నట్లు తెలిసింది. ఆ సమయంలో ఆమె భర్త నాగరాజు తన తండ్రి కోటేశ్వరరావుకు ఆరోగ్యం బాలేకపోవడంతో ఆసుపత్రికి వెళ్లి అక్కడే ఉన్నాడు. ఆమె అత్త కూడా ఇద్దరు పిల్లలతో కలిసి వేరే గదిలో నిద్రపోయారు. అయితే అత్త ఉదయాన్నే నిద్ర లేచి చూసే సరికి శ్రావణి రక్తపు మడుగులో శవమై పడి ఉంది.
ముమ్మర దర్యాప్తు..
సమాచారం అందుకున్న మైలవరం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్, రెడ్డిగూడెం ఎస్‌ఐ శ్రీను సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుడి కోసం ఎనిమిది బృందాలుగా ఏర్పాటు చేసినట్లు సీఐ తెలిపారు. అయితే ఇప్పటికే అనుమానితుడైన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.


