పెరిగిన కొబ్బరి కాయ ధర
వీటికి ఆమోదం..
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మకు భక్తులు సమర్పించే కొబ్బరి కాయ ధరను దేవస్థానం పెంచింది. ప్రస్తుతం రూ. 20కు దేవస్థానం భక్తులకు కొబ్బరి కాయలను విక్రయిస్తుండగా, ఇకపై కాయ ఒక్కింటికీ రూ. 35 విక్రయించాలని దుర్గగుడి ట్రస్ట్ బోర్డు నిర్ణయించింది. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ట్రస్ట్ బోర్డు సమావేశం సోమవారం జరిగింది. బ్రాహ్మణ వీధిలోని దేవస్థానానికి చెందిన జమ్మిదొడ్డి ఆవరణలోని బోర్డు హాల్‌లో సమావేశం జరిగింది. చైర్మన్ బొర్రా రాధాకృష్ణ అధ్యక్షతన, ఈవో శీనానాయక్, బోర్డు సభ్యులు, ఇంజినీరింగ్ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. అత్యధికంగా ఇంజినీరింగ్ పనులకు సంబంధించి దేవస్థాన అధికారులు అజెండాలో పొందుపరచగా, వాటిపై చర్చ జరిగింది. గత రెండు సమావేశాల్లో ట్రస్ట్ బోర్డు చేసిన పలు సూచనలు ఏ మేరకు ఆచరణలోకి వచ్చాయనే అంశంపైనా చర్చ సాగింది. సమావేశంలో ఈఈ కోటేశ్వరరావు, ఏఈవోలు, సూపరింటెండెంట్లు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
వాయిదా పడిన అంశాలివే..
సీవీ రెడ్డి చారిటీస్‌లో పాత డార్మేటరీ హాల్‌లో 150 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసేందుకు డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసస్, ఎన్టీఆర్ జిల్లా లాంగ్ లీజ్ ప్రతిపాదన చేసింది. ఇదే అంశాన్ని ఆలయ అధికారులు ట్రస్ట్ బోర్డు సమావేశంలో ప్రతిపాదనలు అందించారు. ఈ అంశాన్ని పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సభ్యులు నిర్ణయించి ప్రతిపాదనను వాయిదా వేశారు. అమ్మవారికి సమర్పించిన చీరలను పోగు చేసుకునే కాంట్రాక్టర్ అదనపు కౌంటర్ ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి కోరారు. ప్రస్తుతం కొండ దిగువన ఉన్న దుకాణాల వ్యవహారం కోర్టు పరిధిలో ఉండటంతో ఆ అంశంపై వచ్చే తీర్పును బట్టి నిర్ణయం తీసుకునేందుకు వాయిదా వేశారు.
దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సమావేశంలో
కీలక నిర్ణయాలు
ఈ ఏడాది దేవస్థానానికి అవసరమైన ఆవు నెయ్యిని సంగం మిల్క్ ప్రోడక్ట్ కంపెనీ నుంచి రూ. 627.50లకు కొనుగోలు చేసేందుకు ట్రస్ట్ బోర్డు ఆమోదం తెలిపింది.
పాతపాడులోని సోలార్ ప్లాంట్ వద్ద అదనపు 33కేవీ హెచ్‌టీ స్విచ్ యార్డ్ ఏర్పాటుకు రూ. 85లక్షలకు కేటాయించింది.
రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలయ ప్రాంగణంలో కూల్ పెయింట్ వేసేందుకు గాను రూ. 10.25 లక్షల విలువైన పనులను ఆమోదించింది.
ఆలయ ప్రాంగణంలో స్టెయిన్ లెస్ స్టీల్ సీటింగ్ బెంచీలను ఏర్పాటు చేసేందుకు గాను తయారు చేసిన రూ. 42లక్షల అంచనా పనులకు ఆమోదం తెలిపింది.
మార్చి 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరిగే మహా కుంభాభిషేకానికి ట్రస్ట్ బోర్డు ఆమోదం తెలిపింది.


