రాష్ట్రంలో సమగ్ర క్రీడా పాలసీ
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): సమగ్ర క్రీడా పాలసీతో రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు తెలిపారు.
విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలోని శాప్ ప్రధాన కార్యాలయంలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఒలింపిక్స్, కామన్ వెల్త్, ఏషియన్ గేమ్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అమలు చేస్తున్న విధానాలను రాష్ట్రంలోనూ అనుసరించేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ దిశగా క్రీడల్లో ముందున్న తమిళనాడు రాష్ట్రంతో సహా 17 రాష్ట్రాల క్రీడావిధానాలు, పనితీరును అధ్యయనం చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్రీడా మైదానాల్లో మౌలికవసతుల అభివృద్ధి కోసం రూ.54 కోట్ల విలువైన ప్రాజెక్టులను చేపట్టామన్నారు.
శాశ్వత క్రీడా మౌలికవసతుల అభివృద్ధిలో భాగంగా శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియం, విశాఖపట్నం కొమ్మాదిలో రూ.25కోట్లతో ఆధునిక స్టేడియం నిర్మాణం, విజయనగరంలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు, అరకు–పాడేరు ప్రాంతాల్లో క్రీడల్లో ప్రతిభ ఉన్న గిరిజన పిల్లల కోసం ఎస్టీ కంపోనెంట్ నిధులు, స్పోర్ట్స్ అథారిటీ సహకారంతో రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కాకినాడలో ఖేలో ఇండియా పథకం కింద సింథటిక్ ట్రాక్ పూర్తి చేసి, అక్కడే క్రీడా అకాడమీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విజయవాడలోని ఐజీఎంసీ స్టేడియాన్ని ఆధునిక ప్రమాణాలతో అభివృద్థి చేసేందుకు శాప్ చర్యలు చేపడుతోందన్నారు. తిరుపతిలో స్టేడియం, స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు ద్వారా రాష్ట్రంలోని ప్రధాన క్రీడా కేంద్రంగా అభివృద్థి చేస్తామన్నారు. పలువురు కబడ్డీ క్రీడాకారుల సర్టిఫికెట్లు నకిలీవని నిర్ధారణ కావడంతో వారి మీద చట్టపరమైన చర్యల కోసం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. క్రీడాకారులు శాప్ ద్వారా గుర్తింపు పొందిన క్రీడా సంఘాలు నిర్వహించే టోర్నమెంట్లలో మాత్రమే పాల్గొనాలని, రాష్ట్రంలోని అన్ని క్రీడా సంఘాలు ఈనెల 15వ తేదీలోపు క్రీడా యాప్‌లో తమకు సంబంధించిన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని ఆయన సూచించారు. సమావేశంలో శాప్ డైరెక్టర్ సంతోష్ పాల్గొన్నారు.
– శాప్ చైర్మన్ రవినాయుడు


