మేనత్త ఇంట్లో చోరీ చేసిన యువకుడు అరెస్ట్
నిందితుడిని పట్టించిన సీసీ కెమెరాలు 176 గ్రాముల బంగారం స్వాధీనం
లబ్బీపేట(విజయవాడతూర్పు): నూతన సంవత్సరం వేళ డిసెంబరు 31 రాత్రి చర్చికి వెళ్లిన మేనత్త ఇంట్లోకి చొరబడి నగలు చోరీ చేసిన ఓ యువకుడిని సీసీఎస్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు, శనివారం అరెస్టు చేసి చోరీచేసిన రూ.23 లక్షల విలువైన 176 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు...గుంటూరుజిల్లా తాడేపల్లికి చెందిన గండికోట మనోజ్‌కుమార్ హెయిర్‌విగ్‌లు బిజినెస్ చేస్తూ వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవాడు. ఈ నేపథ్యంలో వాంబేకాలనీలో ఉంటున్న తన మేనత్త అరుణ గత డిసెంబరు 31న రాత్రి ఇంటికి తాళం వేసి చర్చికి వెళ్లగా, ఆమె ఇంట్లో నగలు, నగదు ఉంటాయని తెలిసిన మనోజ్‌కుమార్ వెనుక ఉన్న తలుపులు పగలకొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. బీరువా తాళం తీసి అందులోని బంగారు ఆభరణాలు తీసుకుని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన ఏడీసీపీ యం రాజారావు, ఏసీపీ వెంకటేశ్వర్లు, సీసీఎస్ సీఐలు శ్రీనివాసరావులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ఈక్రమంలో శనివారం వన్‌టౌన్ శివాలయం వీధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న మనోజ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు అతని వద్ద నుంచి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు సీసీఎస్ ఏడీసీపీ యం రాజారావు తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంతో కృషి చేసిన సిబ్బందిని సీపీ రాజశేఖరబాబు అభినందించారు.


