సర్కారీ ఆవకాయ్‌.. అడ్డొస్తే కూల్చేయ్‌! | - | Sakshi
Sakshi News home page

సర్కారీ ఆవకాయ్‌.. అడ్డొస్తే కూల్చేయ్‌!

Jan 4 2026 6:51 AM | Updated on Jan 4 2026 6:51 AM

సర్కా

సర్కారీ ఆవకాయ్‌.. అడ్డొస్తే కూల్చేయ్‌!

● అప్‌కాస్ట్‌ సరిహద్దు గోడ పునాది సైతం ధ్వంసం ● గత టీడీపీ ప్రభుత్వంలోనే పున్నమిఘాట్‌ పరాధీనం ● జిల్లా యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు

ప్రభుత్వ తీరు వల్లే..

సర్కారీ ఆవకాయ్‌.. అడ్డొస్తే కూల్చేయ్‌!
ప్రైవేట్‌ స్థలాల్లోకి చొరబడి మరీ కూల్చివేతలు

కూల్చివేసిన అప్‌కాస్ట్‌ సరిహద్దు ప్రహరీ పునాదులు

భవానీపురం(విజయవాడపశ్చిమ): చంద్రబాబు ప్రభుత్వం ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి మూడు రోజులపాటు విజయవాడ కృష్ణానదీ తీరాన పున్నమిఘాట్‌లో ‘ఆవకాయ్‌ అమరావతి’ పేరిట ఉత్సవాలు నిర్వహించనుంది. ఈ ఉత్సవాల కోసం అడ్డం వచ్చిన కట్టడాలను అధికారులు యథేచ్ఛగా కూల్చివేస్తున్నారు. అది ప్రభుత్వ స్థలమా? లేక ప్రైవేట్‌ స్థలమా అన్నది పట్టించుకోవడం లేదు. ప్రైవేటు స్థలాల్లో కట్టడాలను సైతం అడ్డం వస్తున్నాయన్న సాకుతో ధ్వంసం చేస్తున్నారు. పున్నమిఘాట్‌ వద్ద అత్యధిక స్థలాలు ప్రైవేట్‌ వ్యక్తులకు చెందినవే. తమతో చెప్పకుండానే తమ స్థలాల్లో ప్రభుత్వ కార్యక్రమాలను ఎలా నిర్వహిస్తారంటూ ఇటీవల అక్కడే ప్రెస్‌మీట్‌ పెట్టి ఆయా స్థలాల ఓనర్లు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆవకాయ్‌ అమరావతి ఉత్సవాన్ని ప్రభుత్వ స్థలంలోనే నిర్వహిస్తామని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ జి.లక్ష్మీశ ఓ ప్రకటన విడుదల చేశారు. అందుకు విరుద్ధంగా ప్రైవేట్‌ స్థలాల్లోకి చొరబడిమరీ సరిహద్దుగా ఏర్పాటు చేసుకున్న రేకులను తొలగిస్తున్నారు. అక్కడితో సరిపెట్టుకోకుండా ఆవకాయ్‌ ఉత్సవానికి అవసరమంటూ ప్రైవేట్‌ స్థలమైన బబ్బూరి గ్రౌండ్‌లో ఏర్పాటు చేసుకుంటున్న ఎగ్జిబిషన్‌కు సంబంధించి కట్టుకున్న స్టాళ్లను కూడా నిరాక్షిణ్యంగా కూల్చేస్తున్నారు. పున్నమిఘాట్‌లో సొంత స్థలం చుట్టూ నిర్మించుకుంటున్న సరిహద్దు గోడను సైతం కూల్చేశారు. అంతా తమ ఇష్టం అన్న చందంగా జిల్లా యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అప్‌కాస్ట్‌ ప్రహరీ పునాది కూల్చివేత

భవానీపురం కరకట్ట సౌత్‌ రోడ్డులోని పున్నమిఘాట్‌కు ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (అప్‌కాస్ట్‌) రీజనల్‌ సైన్స్‌ సెంటర్‌కు చెందిన సుమారు ఎకరానికిపైగా ఉన్న ఖాళీ స్థలాన్ని రెండేళ్ల క్రితం స్వాధీనం చేసుకుని సరిహద్దుల ప్రకారం సుమారు రూ.40 లక్షలకుపైగా ఖర్చు పెట్టి ప్రహరీ నిర్మించారు. 2024 అక్టోబర్‌లో చంద్రబాబు ప్రభుత్వం పున్నమిఘాట్‌లో నిర్వహించిన డ్రోన్‌ షో కార్యక్రమానికి అడ్డుగా ఉందని అప్‌ కాస్ట్‌ సరిహద్దు గోడను జేసీబీతో కూల్చివేశారు. ఆ ప్రహరీని పునర్నిర్మించే ఒప్పందంపైనే కూల్చివేశా రని, తిరిగి నిర్మిస్తారని అప్పట్లో అప్‌కాస్ట్‌ అధికారులు చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి అటువంటిదేమీ జరగకపోగా ఇప్పుడు ఆవకాయ్‌ అమరావతి పేరుతో అదే స్థలంలో నిర్వహించనున్న కార్యక్రమాల కోసం గతంలో కూల్చేసిన ప్రహరీకి సంబంధించి సుమారు అడుగు ఎత్తులో ఉన్న గోడతోపాటు పునాదులను సైతం డ్రిల్లింగ్‌ యంత్రంతో ధ్వంసం చేశారు. అంటే అప్‌కాస్ట్‌ సరిహద్దు స్థలం మొత్తాన్ని నేలమట్టం చేసేశారు. అది ప్రభుత్వ స్థలమే అయినప్పటికీ లక్షలాది రూపాయల ప్రజాధనం వృథా కావడం గమనార్హం.

2016వ సంవత్సరంలో కృష్ణాపుష్కరాల సమయంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం రివర్‌ ఫ్రంట్‌ కింద కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కుమ్మరించి పున్నమిఘాట్‌ నిర్మిం చింది. ఈ ఘాట్‌లో సింహభాగం అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలోనే పరాధీనం అయ్యింది. పున్నమిఘాట్‌ నిర్మాణం పూర్తయిన తరువాత ఆ స్థలం తమదంటూ కొందరు వ్యక్తులు కోర్టును ఆశ్రయించారు. దీంతో స్థలాన్ని వారికి స్వాధీనం చేయాలంటూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దీంతో అప్పటి తహసీల్దార్‌ పున్నమిఘాట్‌లో ప్రధానంగా నిలిచిన స్థలాన్ని వారికి స్వాధీనం చేశారు. ఆ తరువాత స్థల యజమానులు చుట్టూ ప్రహరీ నిర్మించుకున్నారు. గతంలో ఇక్కడ నిర్వహించిన ఎయిర్‌ షో, సీ ప్లేన్‌ కార్యక్రమాలకు ఈ స్థలమే కేంద్రబిందువుగా నిలిచింది. ఆ స్థలానికి (పున్నమిఘాట్‌) సంబంధించి అప్పటి టీడీపీ ప్రభుత్వానికి ప్రైవేట్‌ వ్యక్తులకు మధ్య ధర విషయంలో సయోధ్య కుదిరి ఉండి ఉంటే ఈ రోజు ఆవకాయ్‌ అమరావతి కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండేది కాదని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.

సర్కారీ ఆవకాయ్‌.. అడ్డొస్తే కూల్చేయ్‌!1
1/3

సర్కారీ ఆవకాయ్‌.. అడ్డొస్తే కూల్చేయ్‌!

సర్కారీ ఆవకాయ్‌.. అడ్డొస్తే కూల్చేయ్‌!2
2/3

సర్కారీ ఆవకాయ్‌.. అడ్డొస్తే కూల్చేయ్‌!

సర్కారీ ఆవకాయ్‌.. అడ్డొస్తే కూల్చేయ్‌!3
3/3

సర్కారీ ఆవకాయ్‌.. అడ్డొస్తే కూల్చేయ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement