ఉన్నత వ్యక్తిత్వాన్ని అలవరచుకోవాలి
పుస్తక మహోత్సవంలో వక్తలు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): యువత ఉన్నత వ్యక్తిత్వాన్ని అలవరచుకోవాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. విజయవాడ పుస్తకమహోత్సవంలో భాగంగా ఐఏఎస్ అధికారి అద్దంకి శ్రీధర్‌బాబు రచించిన ‘మీరు శ్రీలు కావచ్చు’ పుస్త కాన్ని మండలి బుద్ధప్రసాద్ శనివారం సాయంత్రం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాజంలో కీలకపాత్ర పోషించే యువత ఉన్నత వ్యక్తిత్వం కలవారుగా ఉండాలన్నారు. ఉన్నత వ్యక్తిత్వ లక్షణాలను పెంపొందించుకునేందుకు శ్రీధర్‌బాబు రచన ఉపయోగపడుతుందన్నారు. సామాన్యులను అసామాన్యులుగా మార్చే శక్తి ఈ రచనకు ఉందని అభినందించారు. విద్యే సాధనంగా తమ జీవితాలను మార్చుకోవాలకునే యువతీయువకులు ఈ పుస్తకాన్ని చదవాలని సూచించారు. పుస్తక సంపాదకుడు వల్లీశ్వర్ మాట్లాడుతూ.. సమాజంలో తగిన గుర్తింపు పొందడం, నలుగురికీ తమ వంతు సహాయం చేయడం వంటి రెండు మంచి పనులు విద్య వల్ల సుసాధ్యమవుతాయని వివరించారు. రచయిత శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తిలోనూ ఉన్న అంతర్గత శక్తులను వెలికితీయడమే లక్ష్యంగా కథలతో కలగలిపి ఒక ప్రయత్నం చేశామన్నారు. 36 కథలుగా ఉన్న ఈ పుస్తకం యువ తకు ప్రయోజనకరంగా ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రచురణకర్త దూపాటి విజయకుమార్ సభను నిర్వహించారు.
‘మను స్మృతిలో ఏముంది?’ పుస్తకావిష్కరణ
మాకినేని బసవపున్నయ్య అధ్యయన కేంద్రం అధ్యక్షుడు, మాజీ ఎంపీ పి.మధు రచించిన ‘మనుస్మృతిలో ఏముంది?’ పుస్తకాన్ని సాహితీ విమర్శకుడు డాక్టర్ కోయి కోటేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చైతన్యవంతమైన పౌరులు వివిధ విధానాలు, సిద్ధాంతాల వల్ల ప్రయోజనాల గురించే కాక, వాటి వల్ల రాబోయే ప్రమాదాలను సైతం చర్చించాలన్నారు. సామాన్య విద్యావంతులకు కూడా అర్థమయ్యే భాషలో ‘మను స్మృతిలో ఏముంది?’ పుస్తకం రాసిన రచయితను అభినందించారు. మను స్మృతి భావజాలం భారత రాజ్యాంగానికి వ్యతిరేకమన్నారు. రాజ్యాంగం ప్రవ చిస్తున్న భావజాలాన్ని విశ్వసించి పాటించేవారే నిజమైన దేశభక్తులన్నారు. సభాధ్యక్షుడు పిన్నమనేని మురళీకృష్ణ మాట్లాడుతూ.. దేశ వెనకబాటుతనానికి గల కారణాల్లో మను స్మృతి భావజాలం కూడా ఒకటన్నారు. కులవివక్ష ప్రాచీన సమాజంలోని ఒక రుగ్మతని పేర్కొన్నారు. అది ఆధునిక యుగంలోనూ కొనసాగడం దురదృష్టకరమన్నారు. మానవులందరూ సమానమని, మహిళలను గౌరవించాలని మను స్మృతిలో ఉన్నప్పటికీ సానుకూల అంశాల కన్నా, వివక్షాపూరితమైన అంశాలే ఎక్కువగా ఉన్నా యని అభిప్రాయపడ్డారు. అందుకే డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ మను స్మృతిని ఖండించారని చెప్పారు. పాత్రికేయుడు వరప్రసాద్ మాట్లాడుతూ.. సమాజంపై భగవద్గీత కన్నా మనుధర్మశాస్త్ర ప్రభావమే ఎక్కువగా ఉందన్నారు. అక్షరాస్యత నామమాత్రంగా ఉన్నకాలంలో కొద్దిమంది అక్షరాస్యులు సృష్టించిన ఈ పుస్తకంలోని నియమాలు, కట్టుబాట్లు నేటికీ పాటించాలనుకోవడం విచారకరమన్నారు. కళాకారుడు గుండు నారాయణరావు సభకు స్వాగతం పలకగా మాకినేని బసవపునన్నయ్య విజ్ఞానకేంద్రం బాధ్యులు క్రాంతి వందన సమర్పణ చేశారు.
ఉన్నత వ్యక్తిత్వాన్ని అలవరచుకోవాలి


