వైభవంగా ఇంద్ర గిరిప్రదక్షిణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పుష్య పౌర్ణమిని పురస్కరించుకుని ఆదిదంపతులు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ శనివారం తెల్లవారుజామున అంగరంగ వైభవంగా జరిగింది. తెల్లవారుజాము 5.55 గంటలకు దుర్గగుడి ఘాట్‌రోడ్డులోని కామథేను అమ్మ వారి ఆలయం నుంచి గిరిప్రదక్షిణ ప్రారంభమైంది. తొలుత ప్రత్యేకంగా పూలతో అలంకరించిన వాహనంపై శ్రీగంగాపార్వతి(దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చకులు పూజలు చేశారు. అనంతరం ఆలయ ఈఓ శీనానాయక్ దేవతా మూర్తులకు పూజలు నిర్వహించి, దేవస్థాన ప్రచార రథానికి కొబ్బరి కాయ కొట్టి ఊరేగింపును ప్రారంభించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, డప్పు కళాకారుల విన్యాసాలు, చిన్నారుల కోలాట నృత్యాల మధ్య సాగిన ఊరేగింపులో ఆది దంపతుల వెంట పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. కుమ్మరి పాలెం, నాలుగు స్తంభాల సెంటర్, సితార, కబేళ, పాలప్రాజెక్టు, కేఎల్‌రావునగర్, చిట్టినగర్, కేటీరోడ్డు, బ్రాహ్మణ వీధి మీదుగా ఊరేగింపు ఆలయానికి చేరుకుంది. గిరిప్రదక్షిణ మార్గంలో భక్తులు ఆదిదంపతులకు పూజాసామగ్రి సమర్పించి ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు.
వైభవంగా ఇంద్ర గిరిప్రదక్షిణ


