బాస్కెట్‌బాల్ బాలుర విజేతగా కృష్ణా
నూజివీడు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి బాలుర, బాలికల అండర్–17 బాస్కెట్‌బాల్ పోటీలలో భాగంగా బాలుర విజేతగా ఉమ్మడి కృష్ణా జిల్లా జట్టు, బాలికల విజేతగా ఉమ్మడి తూర్పుగోదావరి జట్లు నిలిచాయి. మూడు రోజులుగా నూజివీడులో నిర్వహిస్తున్న బాస్కెట్ బాల్ పోటీలు ముగిశాయి. లీగ్ కం నాకౌట్ పద్ధతిలో నిర్వహించిన ఈ పోటీలకు 13 బాలుర జట్లు, 13 బాలికల జట్లు పాల్గొన్నాయి. బాలుర, బాలికల ఫైనల్స్ పోటీలను ఆదివారం నిర్వహించారు. బాలుర ఫైనల్స్‌లో ఉమ్మడి కృష్ణా జిల్లా జట్టు, తూర్పుగోదావరి జట్లు తలపడగా ఉమ్మడి కృష్ణా జిల్లా జట్టు ఆద్యంతం ఆధిక్యత కనబరిచి 39–18తో ఉమ్మడి తూర్పుగోదావరి జట్టుపై గెలుపొంది విజేతగా నిలిచింది. దీంతో కృష్ణా జిల్లా జట్టు వరుసగా 8వ సారి విజేతగా నిలిచింది.
బాలికల విభాగంలో..
బాలికల విభాగంలో తూర్పుగోదావరి జట్టు, గుంటూరు జట్లు ఫైనల్స్‌కు చేరాయి. ఫైనల్ మ్యాచ్‌లో తూర్పుగోదావరి జట్టు గుంటూరుపై 23–6తో గెలుపొంది విజేతగా నిలిచింది. బాలికల ఫైనల్ మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. ఆద్యంతం తూర్పుగోదావరి జట్టు ఆటగాళ్లు ప్రతిభ కనబరిచి జట్టును విజయపథాన నడిపారు. బాలుర విభాగంలో మూడు, నాలుగు స్థానాల్లో గుంటూరు, చిత్తూరు నిలవగా, బాలికల విభాగంలో మూడు, నాలుగు స్థానాల్లో కృష్ణా, వైజాగ్ జట్లు నిలిచాయి. గెలుపొందిన జట్లకు ట్రోఫీలను రూరల్ ఎస్‌ఐ జ్యోతిబసు, బేతస్థ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కరస్పాండెంట్ బండి శ్యామ్ చేతుల మీదుగా అందజేశారు. పోటీలను కార్యనిర్వాహక కార్యదర్శి వాకా నాగరాజు పర్యవేక్షించారు.


