జాతీయ సమైక్యతను చాటిన జానపద నృత్యాలు
మూడు ప్రాంతాల ముచ్చటైన కళారూపాలు విభిన్న సంప్రదాయాల మేళవింపు ఆద్యంతం ఆకట్టుకున్న ప్రదర్శనలు
విజయవాడ కల్చరల్: ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం ఆధ్యర్యంలో నెల వారీ కార్యక్రమంలో భాగంగా శనివారం ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాకు చెందిన కళాకారుల బృందం ప్రదర్శించిన జానపద నృత్యాలు జాతీయ సమైక్యతను చాటాయి. ప్రాంతాలు, కళారూపాలు వేరైనా కళాకారులకు ఎల్లలు లేవని నృత్య ప్రదర్శనలు రుజువు చేశాయి. మూడు ప్రాంతాల భాషా సంస్కృతి, సంప్రదాయాలను మేళవిస్తూ ప్రదర్శనలు త్రివేణీ సంగమంలా సాగాయి. విశాఖపట్నానికి చెందిన స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ బృందం నిర్వాహకుడు నాగరాజు పర్యవేక్షణలో డి.లక్ష్మి, స్నేహిత, ఎస్. జోషిత, బి.పూజిత, చందన, వై.ఇందిర, బి.గీతిక, బి.అంజలి, అప్పలనాయుడు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలలో ప్రదర్శించే అంశాలను ప్రదర్శించారు. రిథమ్స్ డ్యాన్స్ అకాడమీ, పశ్చిమబెంగాల్‌కు చెందిన పశ్చిమ బెంగాల్, చత్తీస్ ఘడ్ గ్రామీణ ప్రాంతాలలో ప్రదర్శించే నృత్యాలను ప్రదర్శించారు. ట్రైబల్ ఫోక్ ఆర్ట్స్ సెంటర్ ఒడిశా బృందం ఒడిశా జీవిన విధానం చాటేలా నృత్యాలను మనోహరంగా ప్రదర్శించారు. వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన నాట్యాచార్యులు పాల్గొన్నారు. అకాడమీ నిర్వాహకులు ఎన్.లలిత్ ప్రసాద్, సాంస్కృతిక సమితి కార్యదర్శి బీవీఎస్ ప్రకాష్ కళాకారులను సత్కరించారు. అధ్యాపకుడు డాక్టర్ సత్యశ్రీనివాస్ నిర్వహించారు.
జాతీయ సమైక్యతను చాటిన జానపద నృత్యాలు


