బెంగళూరు–నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌కు అదనపు కోచ్‌లు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణీకుల రద్దీ, వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికుల సౌకర్యార్థం బెంగళూరు–నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌కు అదనపు కోచ్‌లను జతచేసి నడపనున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్‌ఓ నుస్రత్ మండ్రుప్కర్ శనివారం ఒక ప్రకటలో తెలిపారు. డిసెంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు బెంగళూరు–నాందేడ్ (16593) రైలుకు, డిసెంబర్ 3వతేదీ నుంచి 17వ తేదీ వరకు నాందేడ్–బెంగళూరు (16594) ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఒక 3ఏసీ కోచ్, ఒక జనరల్, ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ను అదనంగా జోడించి నడుపుతామని వివరించారు.
కోనేరుసెంటర్: కృష్ణా విశ్వవిద్యాలయంలో 16(అ) ఆంధ్ర బెటాలియన్ ఎన్‌సీసీ ఆధ్వర్యంలో శనివారం ఎన్‌సీసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కృష్ణా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె.రాంజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌సీసీ సేవా విలువలను కొనియాడారు. ఎన్‌సీసీ క్రమశిక్షణ, నాయకత్వం, దేశం పట్ల సేవా భావాన్ని కలిగిస్తుందని తెలిపారు. యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.విజయ కుమారి మాట్లాడుతూ ఎన్‌సీసీ శిక్షణ విద్యార్థుల వ్యక్తిత్వ వికాసంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఏఎన్‌ఓ లెఫ్టినెంట్ డాక్టర్ డి.రామశేఖరరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరిస్తూ క్యాడెట్లు క్రమశిక్షణ, సమాజం పట్ల బాధ్యతను అలవర్చుకుంటారని అన్నారు. అనంతరం ఎన్‌సీసీడే సందర్భంగా క్యాడెట్లు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక చట్టంపై జరిగిన అవగాహన కార్యక్రమంలో క్యాడెట్లు పోస్టర్ ప్రదర్శనలు, చర్చా వేదికలు, అవగాహన సందేశాలు అందిస్తూ విద్యార్థుల్లో చైతన్యం నింపారు. అనంతరం క్యాంపులో పాల్గొన్న క్యాడెట్లకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


