మొండికేస్తున్న వాహన్
సమస్యలివే..
కనిపించని పాత వాహనాలు, లైసెన్స్‌ల డేటా వాహనాల ఇన్సూరెన్స్‌లదీ అదే పరిస్థితి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న వాహనదారులు కమీషన్ ఇస్తేనే ఫిట్‌నెస్
డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ కోసం ప్రయత్నం చేస్తే కొందరి డేటా పోర్టల్‌లో ఉండటం లేదు. పది మందికి గాను ఇద్దరు, ముగ్గురికి ఇలా జరుగుతున్నట్లు చెబుతున్నారు. అలాంటి వారు పీఎన్‌బీఎస్‌లోని రాష్ట్ర కార్యాలయానికి వెళ్తే కొందరికి సమస్య పరిష్కారం అవుతుండగా, మరికొందరికి పనికావడం లేదని వాపోతున్నారు.
కారు ఓన్ రిజిస్ట్రేషన్‌తో ఉన్నది మరొకరికి అమ్మినప్పుడు డాక్యుమెంట్స్ ట్రాన్స్‌ఫర్ అవుతున్నాయి.. కానీ, ఆధార్ లింక్‌లో అమ్మిన వారి పేరునే కారు ఉన్నట్లు చూపుతోంది. ఏదైనా పథకానికి సచివాలయానికి వెళ్లినప్పుడు కారు ఉన్నట్లు చూపుతోంది. అలా కారు అమ్మిన ఏడాది వరకూ పోర్టల్‌లో మార్పు కాక పోవడంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు.
పోర్టర్‌లో కొన్ని పాత వాహనాల డేటా కనిపించడం లేదు. అలాంటి వారు ఆర్టీఏ కార్యాలయానికి వెళ్తే, వాళ్లు తమకు సంబంధం లేదనే విధంగా మాట్లాడుతున్నట్లు చెబుతున్నారు. దీంతో రాష్ట్ర కార్యాలయానికి పరుగులు పెట్టాల్సి వస్తోంది. అక్కడ కూడా కొంతమందికే పని జరుగుతున్నట్లు చెబుతున్నారు.
ఇన్సూరెన్స్‌లు కూడా ఇదే విధంగా ఉంటున్నాయి. చెల్లించిన వారివి కనిపించక పోవడం, రెన్యూవల్‌కు అవసరమైన డేటా లేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలా అనేక రకాల సమస్యలతో వాహనాల దారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
లారీ డ్రైవర్ల ఇబ్బందులు..
రవాణా శాఖ సేవల్లో తీవ్ర జాప్యం
లబ్బీపేట(విజయవాడ తూర్పు): రవాణా శాఖలో దేశ వ్యాప్తంగా ఒకే వ్యవస్థ ఉండాలనే ఉద్దేశంతో పరివాహన్ పోర్టల్‌ను ప్రవేశ పెట్టారు. ఈ పోర్టల్ ద్వారా గతేడాది జూలైలో కొన్ని సేవలు, డిసెంబర్ నుంచి పూర్తిస్థాయిలో అన్ని సేవలు అందించేలా ఆదేశాలు ఇచ్చారు. ఇది జరిగి దాదాపు ఏడాదిన్నర కావొస్తున్నా ఇంకా పురిటి కష్టాలు దాటలేదని వాహనదారులు అంటున్నారు. అడుగడుగునా ఇబ్బందులు తప్పడం లేదని చెబుతున్నారు. అంతేకాదు ఏదైనా సమస్య వస్తే, జిల్లా ఆర్టీఏ కార్యాలయానికి వెళ్తే తమ పరిధి కాదంటున్నారని, రాష్ట్ర కార్యాలయానికి వెళ్తే అక్కడ కొన్ని పనులు చేస్తూ, మరికొన్నింటికీ చేతులెత్తేస్తున్నట్లు వాపోతున్నారు. అదేమంటే ఢిల్లీ నుంచి ఆపరేట్ అవుతుందని చెబుతున్నారని, దీంతో కార్యాలయాల చుట్టూ తిరగలేక విసుగెత్తిపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అన్ని సేవలు పోర్టల్ ద్వారానే..
ప్రస్తుతం రవాణా కార్యాలయం నుంచి అందించే అన్ని సేవలు పోర్టల్ ద్వారానే పొందాల్సి ఉంది. వాహనాల రిజిస్ట్రేషన్, ఒకరి నుంచి మరొకరికి ట్రాన్స్‌ఫర్, ఇన్సూరెన్స్‌లు, వాహన ఫిట్‌నెస్, డ్రైవింగ్ లైసెన్స్‌లు కొత్తవి పొందడం, రెన్యూవల్ వంటి అన్ని రకాల సేవలు పరివాహన్ పోర్టల్ ద్వారానే అందిస్తున్నారు. దీంతో ఈ పోర్టల్ ఒక్కోసారి మొరాయిస్తుండటంతో వాహనదారులు పనులు మానుకొని కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందంటున్నారు.
ఫిట్‌నెస్‌కు చేయి తడపాల్సిందే..
వాహనాల ఫిట్‌నెస్ తనిఖీని ప్రైవేటు సంస్థకు అప్పగించారు. దానిని నున్నలో ఏర్పాటు చేశారు. అక్కడకు వాహనాలు తనిఖీ కోసం వెళ్లినప్పుడు ఏదొక సాకు చూపి డబ్బులు వసూలు చేస్తున్నట్లు వాహనదారులు అంటున్నారు. అంతేకాకుండా అక్కడకు వెళ్లిన తర్వాత వారి డ్రైవర్‌లే వాహనాన్ని లోపలికి తీసుకెళ్లి చెక్ చేయిస్తున్నారు. దీంతో గ్లాస్ క్రాక్ ఉందని, టాప్ సరిగా లేదని అనేక లోపాలు చూపుతూ ఫిట్‌నెస్ ఇచ్చేందుకు ముడుపులు వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ముడుపులు అందితే లోపాలున్నా ఫిట్‌నెస్ ఇచ్చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
పరివాహన్ పోర్టల్‌తో లారీ ఓనర్స్ అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఈ పోర్టల్ అప్‌డేట్ కాలేదు. దీంతో మన లారీలు ఆ రాష్ట్రానికి వెళ్లినప్పుడు నంబరు స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ లేదని ఫైన్ వేసే పరిస్థితి ఉంది. అంతేకాక ఇటీవల ఆర్‌సీ బుక్‌లో ఒక లెటర్ తప్పుగా ఉంటే సరిచేసేందుకు ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. గతంలో లారీలు కొన్ని నెలలు ఆపినప్పుడు ఆ సమయానికి ట్యాక్స్ మినహాయించే వారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రమాదాలు జరిగినప్పుడు రోజుల తరబడి లారీలను నిలపాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇతర వాహనదారులు కూడా ఈ పోర్టల్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
– వైవీ ఈశ్వరరావు, సౌత్ జోన్ ఉపాధ్యక్షుడు, ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్ పోర్ట్ కాంగ్రెస్
మొండికేస్తున్న వాహన్


