స్ఫూర్తిసారథి సత్యసాయి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ వంటి మానవతా విలువల పరిమళాలను నలుదిశలా వ్యాపింపజేసిన స్ఫూర్తి సారథి శ్రీ సత్యసాయి అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శతజయంతి వేడుకలు ఆదివారం కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఘనంగా జరిగాయి. కలెక్టర్ అధికారులతో కలిసి శ్రీ సత్యసాయి చిత్రపటానికి పూలమాలలు వేశారు. కలెక్టర్ మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవగా భావించి ఎనలేని సేవ చేసిన సత్యసాయిబాబా స్ఫూర్తి తో యువత ముందడుగు వేయాలన్నారు.
సత్యసాయి మందిరంలో..
ఏలూరు రోడ్డులోని సీతారాంపురం శ్రీ సత్యసాయి మందిరంలో జరిగిన సత్యసాయి శతజయంతి వేడుకల్లో కలెక్టర్ లక్ష్మీశ పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు అందించారు. సత్యసాయి సేవాసమితి కన్వీ నర్ ఎన్వీఎల్ నరసింహారావు పాల్గొన్నారు.
కోనేరుసెంటర్: మచిలీపట్నంలో వచ్చే జనవరి 11వ తేదీన నిర్వహించనున్న 3కే రన్ పోస్టర్‌ను కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం, ఫిట్‌నెస్ పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆరోగ్యవంతమైన జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యంతో వీర్నాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సెంటర్ నుంచి కోనేరుసెంటర్ వరకు నిర్వహించబోయే 3కే రన్‌లో అందరూ భాగస్వాములు కావాలని తెలిపారు. కార్యక్రమం అనంతరం 25 మంది పేర్లను లక్కీ డ్రాలో తీసి ఒక్కొక్కరికీ రూ.5000 చొప్పున ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి. సత్యనారాయణ పాల్గొన్నారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఈటానగర్‌లో జరుగుతున్న 42వ ఎన్‌టీపీసీ సబ్–జూనియర్స్ నేషనల్ ఆర్చరీ చాంపియన్ షిప్–2025లో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులు పతకాలు సాధించారు. రికర్వ్ బాలికల ర్యాంకింగ్ రౌండ్‌లో 674 పాయింట్లతో కొండపావులూరి యుక్తశ్రీ కాంస్య పతకం, రికర్వ్ బాలికల టీమ్ విభాగంలో కొండపావులూరి యుక్తశ్రీ, టి.భువన రాజేశ్వరి, టి.వైష్ణవి, చెరుకూరి డాలీ శివానీ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారని ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ చైర్మన్ చెరుకూరి సత్యనారాయణ తెలిపారు. క్రీడాకారులను ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బీవీ రమణ, కోశాధికారి చెరుకూరి కృష్ణకుమారి, కోచ్‌లు నవీన్ కుమార్, ఈ.సాహిత్, టి.శివశంకర్, మేనేజర్ ఆకుల కిరణ్ అభినందించారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అంతరిక్ష విజ్ఞానం, సాంకేతికతపై విదార్థులు, యువతలో ఉత్సుకతను పెంపొందించేందుకు ‘స్పేస్ ఆన్ వీల్స్’ ఏర్పాటు చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. ఆదివారం విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్పేస్ ఆన్ వీల్స్‌ను కలెక్టర్ సందర్శించారు. ఆయన మాట్లాడుతూ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) ఆధ్వర్యంలో స్పేస్ ఆన్ వీల్స్ విజయవంతంగా ముందుకు సాగుతోందన్నారు. విద్యార్థులకు ఉపయోగపడేలా సోమవారం కూడా ఈ ప్రదర్శనను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. భారతదేశ తొలి ఉపగ్రహ వాహక నౌక నుంచి తాజాగా ఇస్రో ప్రయోగాల వరకు, లాంచ్‌ప్యాడ్లు, చంద్రయాన్, మంగళయాన్, రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్, శాటిలైట్ కమ్యూనికేషన్ టెక్నాలజీ తదితర విషయాలపై పరిజ్ఞానాన్ని పెంచేలా ప్రదర్శనలు ఉన్నాయన్నారు. షార్ టెక్నికల్ అధికారి కిరణ్ పాల్గొన్నారు.
స్ఫూర్తిసారథి సత్యసాయి
స్ఫూర్తిసారథి సత్యసాయి
స్ఫూర్తిసారథి సత్యసాయి


