భాషా, సంస్కృతులు దేశ ఔన్నత్యానికి ప్రతీకలు
సాంస్కృతిక వారధులను ప్రోత్సహించాలి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ
భవానీపురం(విజయవాడపశ్చిమ): తెలుగు భాషా, సంస్కృతులు దేశ ఔన్నత్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. కవులు, రచయితలు, కళాకారులు వారివారి రంగాలలో అందిస్తున్న సేవలతో భారతీయత వెల్లివిరుస్తుంది. అటువంటి వారిని ప్రోత్సహించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ఏపీ రాష్ట్ర సృజనాత్మక, సంస్కృతి సమితి, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న జాతీయ సాంస్కృతిక ఉత్సవాల్లో భాగంగా శనివారం తొలి రోజు కార్యక్రమాలను కలెక్టర్ లక్ష్మీశ, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. జీఆర్‌కే పోలవరపు సాంస్కృతిక సమితి అధ్యక్షుడు గోళ్ల నారాయణరావు అధ్యక్షతన జరిగిన సభలో కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ రచయితలు, కవులు, కళాకారులను ఆదరించే ప్రాంతం వర్ధిల్లుతుందన్నారు. ఆధునిక జీవనశైలిలో మసకబారుతున్న కళలు, సాంస్కృతిక సంపదను పరిరక్షించుకుంటూ వాటిని భావి తరాలకు అమూల్యమైన వారసత్వ సంపదగా అందించేందుకు కవులు, రచయితలు, కళాకారులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించేందుకు ముందుకు వచ్చేవారికి జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి సహాయ సహకారాలను అందిస్తామని చెప్పారు.
జానపద కళలను పరిరక్షించుకోవాలి
అవనిగడ్డ శాసనసభ్యుడు మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ కొందరు పరభాష, సంస్కృతికి లోనవుతున్న తరుణంలో మనదైన తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భాష నశిస్తే సంస్కృతి కూడా నశించిపోతుందన్నారు. కర్నాటక సంగీతమైనా త్యాగరాజ కీర్తనలను తెలుగులోనే పాడాలన్నారు. కనుమరుగవుతున్న జానపద కళలను నిలుపుకొనేందుకు కృషి చేయాలన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ గ్రహీత ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ సంస్కృతికి ఒక వృత్తి ఉందని, అందులో పారిశ్రామికం, సినిమా, వ్యవసాయం, పత్రిక తదితర కల్చర్‌లు ఉన్నాయని చెప్పారు. ఇంకా మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ నిర్వాహకుడు కలిమిశ్రీ , ఆకాశవాణి విశ్రాంత సంచాలకురాలు ముంజులూరి కృష్ణకుమారి, చిన్ని నారాయణరావు సాహితీ ఫౌండేషన్ చైర్మన్ నారాయణరావు, మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, ఏపీ సృజనాత్మకత సంస్కృతి సమితి సీఈఓ రేగుళ్ల మల్లికార్జునరావు, ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, కృష్ణాజిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీవీ పూర్ణచంద్, పుట్టా సురేంద్ర, వేముల హజరత్తయ్య గుప్తా తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పలువురు రచించిన పుస్తకాలను ఆవిష్కరించారు. కార్టూన్ల పోటీకి వచ్చిన కార్టూన్లను కళాక్షేత్రం ఆడిటోరియం ప్రాంగణంలో ప్రదర్శించారు.


