ముగిసిన జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు
అతిథిగా హాజరైన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఏపీ రాష్ట్ర సృజనాత్మక, సంస్కృతి సమితి, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ సంయుక్త నిర్వహణలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. సాహితీవేత్త కొమ్మవరపు విల్సన్‌రావు అధ్యక్షతన జరిగిన ముగింపు సభలో పలువురు కవులు, సాహితీవేత్తలు పాల్గొని తమతమ అంతరంగాలను ఆవిష్కరించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ మాట్లాడుతూ ప్రజల్లో మానవత్వం, ప్రేమతత్వాన్ని పెంపొందించేందుకు కవులు, రచయితలు, కార్టూనిస్ట్‌లు కృషి చేయాలన్నారు.
పాలసీ మేకర్స్ సాహితీ వేత్తలయితే..
నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆచార్య చల్లపల్లి స్వరూపారాణి మాట్లాడుతూ పాలసీ మేకర్స్, బ్యూరోక్రాట్లు సాహితీ వేత్తలయితే నిర్ణయాలు తీసుకోవడంలో సున్నితత్వం ఉంటుందని తెలిపారు. శోకం నుంచే శ్లోకం పుట్టిందని వాల్మీకి మహర్షి ద్వారా నిరూపితమైందని పేర్కొన్నారు.
ప్రతి పాఠశాలలో గ్రంథాలయం ఉండాలి..
అమరావతి సాహితీ మిత్రులు వ్యవస్థాపకులు డాక్టర్ రావి రంగారావు మాట్లాడుతూ అమరావతిలో కోట్లాది రూపాయలతో గ్రంథాలయాన్ని నిర్మించటం కాదని.. ప్రతి పాఠశాలలో లైబ్రరీ ఉండేలా చూడాలని పేర్కొన్నారు. మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ అధ్యక్షుడు కలిమిశ్రీ నిర్వహించిన ఈ కార్యక్రమంలో సాహితీవేత్తలు డాక్టర్ జీవీ పూర్ణచంద్, డాక్టర్ నక్కా విజయరామరాజు, పాతూరి అన్నపూర్ణ, గోవిందరాజు సుభద్రాదేవి, చిన్ని నారాయణరావు, పీ శ్రీనివాస గౌడ్, పుప్పాల శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.


