
పర్యావరణహితంగా పండుగలు చేసుకుందాం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వినాయక చవితి ఉత్సవాల్లో కాలుష్యానికి చెక్ పెట్టి, పర్యావరణ హితంగా పండగలు జరుపుకొనేలా ప్రజలను జాగృతం చేసేందుకు వినూత్న ఆలోచనలతో ముందుకెళ్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ఈ ఏడాది గణేష్ ఉత్సవాలకు మట్టి ప్రతిమల తయారీతో ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ లక్ష్మీశ గురువారం కలెక్టరేట్‌లో వివరించారు. కృత్రిమ రంగులు, రసాయనాలు, థర్మోకోల్ వంటి వినియోగంతో పర్యావరణానికి పెను ముప్పు కలుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణ మండలి, విజయవాడ నగరపాలక సంస్థ, జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రపంచ రికార్డుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఈ నెల 26న నగరంలో అత్యధిక సంఖ్యలో మట్టి ప్రతిమలను తయారు చేసి రికార్డు నెలకొల్పనున్నట్లు వివరించారు. వివిధ పాఠశాలలతో పాటు ఇందిరాగాంధీ మునిసిపల్ మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు, అసోసియేషన్లను కూడా పెద్దఎత్తున భాగస్వాములను చేస్తున్నట్లు వివరించారు. ప్రజలు ఇళ్ల వద్ద మట్టి వినాయక ప్రతిమలను తయారుచేసి ఫొటోలను 91549 70454 నంబరుకు వాట్సాప్ చేయాలని సూచించారు. కొందరు సృజనాత్మకంగా గణపతి ప్రతిమలు చేస్తున్నారని.. రకరకాల గింజలు, ఆకులు, కూరగాయలు వంటివాటిని ఉపయోగించి చేస్తున్నారని.. ఇలాంటివి కూడా తయారుచేసి వాటి ఫొటోలను పంపాలని సూచించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు.
ఆధ్యాత్మిక శోభ వెల్లివిరియాలి
వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా, ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా చూడాలని ఆయా శాఖల అధికారులను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. జేసీ ఎస్.ఇలక్కియ, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, అడిషనల్ సీపీ కేజీవీ సరితతో కలిసి గురువారం ఆయన వినాయక చవితి ఉత్సవాలపై రెవెన్యూ, పోలీస్, కాలుష్య నియంత్రణ మండలి, వైద్య ఆరోగ్యం, అగ్నిమాపక, విద్యుత్ తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. అనుమతులు, పర్యావరణానికి అనుకూలంగా ఉత్సవాలు నిర్వహించుకునేలా కమిటీలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ఉత్సవాల వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, పీసీబీ ఈఈ పి.శ్రీనివాసరావు, విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య, నందిగామ, తిరువూరు ఆర్డీవోలో కె.బాలకృష్ణ, కె.మాధురి తదితరులు పాల్గొన్నారు.