
అరవై లోనూ అలవోకగా...
అరవై ఏళ్లు దాటితే నేమి...అలవోకగా చింతచెట్టు ఎక్కి చిటారు కొమ్మపై నిలబడుతుందామె... చింతచిగురు కోసి అమ్ముకుని ఎవరి మీద ఆధారపడకుండా తన కాళ్లపై తాను నిలబడగలుగుతుంది. ఒంట్లో ఓపిక ఉన్నంత కాలం తన స్వశక్తితోనే జీవనం సాగించాలనే పట్టుదల ఆమెది. ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు మండల పరిధి కందులపాడు గ్రామానికి చెందిన సుఖబోగి రాజమ్మ(60) భర్త ప్రసాద్ అనారోగ్యంతో రెండేళ్ల క్రితం మృతి చెందాడు. ఆమెకు ఇద్దరు కుమారులు. రాజమ్మ తన ఒంట్లో ఓపిక ఉన్నంత కాలం ఒకరి మీద ఆధారపడకూడదనే ఉద్దేశంతో తనకు వచ్చే పింఛన్‌తో పాటు సీజనల్‌గా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. తొలకరి వర్షాలు ప్రారంభం అయితే చాలు రాజమ్మ చింతచెట్ల నుంచి చిగురును సేకరించి విక్రయించడం జీవనోపాధిగా ఎంచుకుంది. ఇరవై ఏళ్లుగా తాను ఈ విధంగా చింత చిగురు కోసి విక్రయిస్తున్నానని రాజమ్మ చెబుతోంది. జి.కొండూరు మండల పరిధి ఆత్కూరు గ్రామ శివారులో చెట్టుపై ఒక కొమ్మ మీద నుంచి మరో కొమ్మ మీదకు సైతం వేగంగా కదలడం చూసి చిన్న వయసు వారే ఆశ్చర్యపోతుంటారు. శభాష్ రాజమ్మ అని అభినందిస్తుంటారు.
–జి.కొండూరు