
పత్తి చేలల్లో నిల్వ ఉన్న నీటిని బయటకు పంపాలి
గరికపాడు కేవీకే శాస్త్రవేత్తలు రాజశేఖర్, శివప్రసాద్
పెనుగంచిప్రోలు: పత్తి చేలల్లో వర్షపునీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గరికపాడు కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ శివప్రసాద్ రైతులకు సూచించారు. మండలంలోని వెంకటాపురం, శనగపాడు, పెనుగంచిప్రోలు గ్రామాల్లో బుధవారం పత్తి పంటలను పరిశీలించారు. పత్తి చేలల్లో వర్షపునీరు బయటకు పంపించిన వెంటనే 20 కేజీల యూరియా, 15 కేజీల పొటాష్‌ను కలిపి ఎకరాకు బూస్టర్ డోస్‌గా వేసుకోవాలని చెప్పారు. దీంతో పంట పెరుగుదల వస్తుందని తెలిపారు. నీరు తగ్గిన తర్వాత 19:19:19: ఎరువుల మిశ్రమాన్ని ఎకరానికి 1 కేజీ స్ప్రే చేసుకోవాలని, ఎండు తెగుల నివారణ కోసం కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములను నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. రసం పీల్చు పురుగులైన పేనుబంక, మైట్స్, త్రిప్స్ ఉన్నట్లయితే వేపనూనె 1000 పీపీఎం మందును 1 లీటర్ నీటితో కలిపి పిచికారీ చేయాలన్నారు. వరి పంటలో 25 కేజీల యూరియా 15 కేజీల పొటాష్‌ను కలిపి వేసుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బి.రామసుబ్బారెడ్డి, ఏఈఓ, వీఏఏలు రైతులు పాల్గొన్నారు.