
కూటమి నిరంకుశానికి లక్ష్మి మృతి నిదర్శనం
మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్ కుమార్
పెదపూడి(మొవ్వ): కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనకు మేడం లక్ష్మి మృతి నిదర్శనమని, ఆమె మరణానికి సర్కారే కారణమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పామర్రు మాజీ ఎమ్మెల్యే ౖకైలే అనిల్‌కుమార్ పేర్కొ న్నారు. పెన్షన్ తొలిగించారనే మనోవ్యథతో పెద పూడి గ్రామంలో దివ్యాంగురాలు మేడం లక్ష్మి మృతి చెందారు. ఆమె కుటుంబ సభ్యులను వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి కైలే అనిల్‌కుమార్ మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్యాయంగా తన పెన్షన్ తొలగించారన్న మనోవ్యథతో లక్ష్మి మరణించటం బాధాకరమన్నారు. ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
నది పరీవాహక ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలి
పటమట(విజయవాడతూర్పు): నగరంలో కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సూచించారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం డ్యామ్ నుంచి మంగళవారం ఉదయం 5.5 లక్షల క్యూసెక్కుల వరద విడుదలవుతోందని, దీంతో హెచ్చరిక జారీ చేశారని తెలిపారు. పులిచింతల డ్యామ్ నుంచి కూడా వరద ప్రవాహం పెరుగుతోందని జలవనరుల శాఖ అధికారులు ప్రమాదక హెచ్చరికలు జారీ చేశారని వివరించారు. ఎగువ నుంచి వస్తున్న వరద నీరు ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోందని వివరించారు. బ్యారేజీ వద్ద వరద ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరికకంటే ఎక్కువగా ఐదు లక్షల క్యూసెక్కులకు చేరుకుందని పేర్కొన్నారు. వరద ఆరు లక్షల క్యూసెక్కుల వరకు పెరిగే అవకాశం ఉన్నందున కృష్ణా నది పరీవాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలందరూ సురక్షిత ప్రాంతాల్లోకి తరలి రావాలని కమిషనర్ సూచించారు. ఆయా ప్రాంతాల ప్రజలు వీఎంసీ సిబ్బందికి సహకరించాలని కోరారు.
ఐదు ఇసుక టిప్పర్ల పట్టివేత
ఆటోనగర్(విజయవాడతూర్పు): ఇసుక తరలిస్తున్న ఐదు టిప్పర్ లారీలను విజయవాడ ట్రాఫిక్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. కృష్ణానదికి వరద వచ్చినప్పటికి పాత వీబీఎం డిగ్రీ కాలేజీ సమీపంలోని జంక్షన్ వద్ద ఇసుక తరలిస్తున్న లారీలను గుర్తించారు. లారీ డ్రైవర్లకు ట్రాఫిక్ ఎస్‌ఐ పి.రాజేంద్రబాబు కౌన్సెలింగ్ ఇచ్చారు. కృష్ణానదికి వరద వచ్చినా లారీల్లో ఇసుక ఎక్కడ నుంచి తీసుకువస్తున్నారు? అనుమతులు చూపాలంటూ ఎస్‌ఐ డ్రైవర్‌లను ప్రశ్నించారు. డ్రైవర్ల నుంచి సమాధానం రాకపోవడంతో ఒక్కో లారీకి రూ.2,035 జరిమానా విధించారు. వరద తగ్గేంత వరకు ఇసుక లారీలు, ట్రాక్టర్లు గాని రావడానికి వీలులేదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే వాహనాలను సీజ్ చేస్తామని ఎస్‌ఐ హెచ్చరించారు.

కూటమి నిరంకుశానికి లక్ష్మి మృతి నిదర్శనం