
వికలాంగ పింఛన్‌దారులకు ‘పర్సంటేజీ’ల షాక్!
పింఛన్లు ఇలా..
దివ్యాంగుల కోసం ఉద్యమిస్తాం..
● పింఛన్లు ఎత్తివేసేందుకు
కొత్త డ్రామాలు
● మరోసారి సదరం సర్టిఫికెట్
తెచ్చుకోవాలని మెలిక
● వికలాంగత్వం తక్కువగా ఉందని
చూపిస్తూ రద్దు చేస్తున్న వైనం
● తెరపైకి నూతన నిబంధనలు
● గగ్గోలు పెడుతున్న లబ్ధిదారులు
మంచానికే పరిమితమైన వారు, కండరాల క్షీణత, రెండు కాళ్లు ఏనుగు కాళ్లలా ఉండటం, పక్షవాతం వచ్చిన వారికి వికలాంగ పింఛన్ అందజేస్తున్నారు. కనీసం 40శాతం, ఆపైబడి వికలాంగత్వం ఉన్నవారికి రూ. 6వేలు, పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి రూ. 15వేలు ఇస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అర్హులకు కూడా సర్వేలు నిర్వహించి ఏదో ఒక సాకుతో రద్దు చేసే ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాకుండా లబ్ధిదారులు నోటీసులు జారీ చేస్తూ.. రూ.15వేల పింఛన్‌ను రూ. 6వేలకు మార్పు చేయటం చేస్తోంది.
చిలకలపూడి(మచిలీపట్నం): కూటమి ప్రభుత్వం వికలాంగ పింఛన్‌దారులకు కుచ్చుటోపీ పెట్టింది. పింఛన్ నగదు పెంచినట్లే పెంచి.. ఇప్పుడు పర్సంటేజీల షాక్ ఇస్తోంది. కొత్త పంథాలో ముందుకు వెళ్తూ.. మొత్తానికి పింఛన్‌నే రద్దు చేస్తోంది. కొత్తగా సదరం పరీక్షలు చేయించుకోవాలని చెప్పి, ఆ పరీక్షల్లో వికలాంగత్వం తక్కువగా ఉందని సాకులు చూపుతూ వారి పింఛన్లు ఎగ్గొట్టేస్తోంది. ఏళ్లుగా పింఛను పొందుతున్న వారికి కొత్త నిబంధనల పేరుతో అర్ధాంతరంగా మొండిచేయి చూపి.. వారిని నడిరోడ్డుపై నిలబెడుతోంది.
రద్దయినట్లు నోటీసులు..
కృష్ణా జిల్లాలో ఆగస్టు 1వ తేదీన రూ.15వేలు పింఛన్ పొందుతున్న వారు 1,280 మంది ఉన్నారు. వీరిలో 482 మందికి మీ పింఛన్‌ను రూ. 6 వేలుగా మార్పు చేస్తున్నట్లు నోటీసులు అందజేశారు. మరికొంత మందికి మీ వికలాంగత్వం తాత్కాలికమైందని పింఛన్ రద్దు చేస్తున్నట్లు నోటీసులు ఇచ్చారు. ఎటువంటి పనిచేయలేని తాము పింఛన్ సొమ్ము రాకుంటే ఎలా జీవించాలని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు.
కోతల పింఛన్..
ఎన్నికల సమయంలో బాహాటంగా హామీలిచ్చి, నేడు అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీల్లో కోత విధించేలా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. దీనిలో భాగంగా నెలకు రూ. 15 వేలు పింఛన్ ఇచ్చే లబ్ధిదారులపై వేటు వేసేందుకు నిర్ణయించింది. జిల్లాలో 1280 మంది లబ్ధిదారులు రూ.15వేలు పింఛన్ తీసుకుంటున్నారు. వీరిలో ప్రస్తుతం సర్వే నెపంతో 482 మందిని రూ.15వేలు పింఛన్‌కు బదులుగా రూ.6వేలకు మార్పు చేశారు. మరికొంత మంది లబ్ధిదారులకు పక్షవాతం, ప్రమాదంలో పూర్తిగా వైకల్యం ఉండి మంచానికి పరిమితమైన వారికి మాత్రమే ఇస్తామని చెప్పి వారిని తొలగించింది. అన్ని అర్హతలు ఉన్న తమకు ఏళ్లుగా పింఛన్ ఇస్తూ.. అర్ధాంతరంగా తొలగించటం ఏమిటని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.
రూ.6వేలు తీసుకునే వారికి కూడా..
మరో పక్క రూ. 6 వేలు పింఛన్ తీసుకుంటున్న వారిపై కూడా కోత విధిస్తోంది. 40 శాతం కంటే వికలాంగత్వం ఎక్కువ ఉంటేనే రూ. 6 వేలు వస్తుందని, మరలా సదరం సర్టిఫికెట్ సమర్పిస్తేనే పింఛన్‌ను కొనసాగిస్తామని లేకుంటే పింఛన్‌ను రద్దు చేస్తామంటున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు.
రీ–వెరిఫికేషన్ పేరుతో అర్హులైన దివ్యాంగులకు పింఛన్లు తొలగిస్తున్నారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అర్హత ఉండి పింఛన్ తొలగిస్తున్నారని దివ్యాంగుల్లో ఆందోళన మొదలైంది. జిల్లా వ్యాప్తంగా తొలగించిన పింఛన్ల వివరాలను సేకరిస్తున్నామని ఆ జాబితాను కలెక్టర్ దృష్టికి తీసుకువెళతాం. అప్పటికీ స్పందించకుంటే వికలాంగుల పింఛన్ల పునరుద్ధరణకు ఉద్యమిస్తాం.
– ఎన్‌ఎస్ నారాయణ, జిల్లా కార్యదర్శి వికలాంగుల హక్కుల జాతీయ వేదిక

వికలాంగ పింఛన్‌దారులకు ‘పర్సంటేజీ’ల షాక్!