
కృష్ణమ్మ దూకుడు
శాంతించిన వరుణుడు
సాక్షి, ప్రతినిధి, విజయవాడ: కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వచ్చి చేరుతోంది. మంగళవారం ఉదయం 6గంటలకు 3.22 లక్షల క్యూసెక్కులు ఉన్న వరద నీరు సాయంత్రానికి 4.66లక్షలు, రాత్రికి 4.87లక్షలకు చేరింది. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టు నుంచి వరద క్రమేపీ పెరగటంతో ఆ నీరు బ్యారేజీలోకి వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వరద 5 లక్షల నుంచి 6 లక్షలకు చేరుతుందన్న అంచనాతో కృష్ణా దిగువ ప్రాంతంలో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
అధికారులకు సెలవులు రద్దు..
ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు వరద ప్రవాహం పెరగటంలో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను అప్రమత్తం చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన క్షేత్ర స్థాయి అధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కృష్ణా నది పరీవాహక ప్రాంతాలైన తోట్లవల్లూరు, పెనమలూరు, కోడూరు, నాగాయలంక తదితర మండలాలు.. బుడమేరు పరీవాహక ప్రాంతంలోని మండలాల అధికారులు, సిబ్బంది పనిచేసే ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరదల నియంత్రణకు వచ్చేంతవరకు ఎవరికీ ఎటువంటి సెలవులు ఉండవని స్పష్టం చేశారు. వరద నీరు 6 లక్షల క్యూసెక్కులకు దాటితే లంక గ్రామాల్లోని ప్రజలను తప్పనిసరిగా సురక్షిత ప్రాంతాలకు చేరవేయాలన్నారు. ఇందుకోసం అవసరమైన పడవలను సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు.
● ఎస్పీ గంగాధర్ రావు మాట్లాడుతూ రాత్రి సమయంలో వరద నీటి పరిస్థితి ఎలా ఉందో తెలియక కాజ్‌వేలు దాటేందుకు కొందరు ప్రజలు ప్రయత్నిస్తుంటారని అక్కడ తప్పనిసరిగా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు.
● జల వనరుల శాఖ ఎస్‌ఈ మోహన్‌రావు మాట్లాడుతూ వరద ప్రవాహం 5.66 లక్షల క్యూసెక్కులకు చేరుకుంటే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తామన్నారు. సమావేశంలో జేసీ గీతాంజలి శర్మ, డీఆర్‌ఓ కె. చంద్రశేఖరరావు, జిల్లా అధికారులు తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
ప్రకాశం బ్యారేజీకి
పోటెత్తుతున్న వరద
బ్యారేజీ నుంచి 4.87లక్షలు
క్యూసెక్కులు దిగువకు విడుదల
ప్రజలను అప్రమత్తం చేసిన
అధికారులు
స్థానికంగా వర్షం తగ్గుముఖం
పట్టడంతో కొంత ఉపశమనం
ఎన్టీఆర్ జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మునేరు ఉద్ధృతి తగ్గింది. మునేరుతో పాటు, స్థానిక వాగుల నుంచి 25వేల క్యూసెక్కుల నీరు మాత్రమే కృష్ణా నదికి వచ్చి చేరుతోంది. చిరు జల్లులు మాత్రమే కురవడంతో విజయవాడ నగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. బుడమేరు వరద నేపథ్యంలో అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెండు పడవలను సిద్ధం చేశారు. ప్రస్తుతం వస్తున్న వరదకు చెవిటికల్లు వద్ద ఉన్న గనిఅతుకులంక చుట్టూ నీరు చేరడంతో అక్కడి వారిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇబ్రహీంపట్నం మండలంలోని చిన్నలంక, జూపూడి లంక, మూలపాడు, త్రిలోచనపురం లంకల్లోకి వరద నీరు చేరింది. లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పడవలపైన ప్రయాణాలు చేస్తున్నారు.

కృష్ణమ్మ దూకుడు