
పోలీస్ గ్రీవెన్స్‌కు 57 ఫిర్యాదులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్‌కు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన బాధితుల నుంచి 57 ఫిర్యాదులు అందాయి. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె దివ్యాంగులు, వృద్ధుల వద్దకే వెళ్లి ఫిర్యాదులు తీసుకుని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాగా తమకు వచ్చిన ఫిర్యాదుల అంశాలను సంబంధిత పోలీస్ స్టేషన్‌ల ఎస్‌హెచ్‌ఓలకు తెలియజేస్తూ సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో భూ వివాదాలు, ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలకు సంబంధించినవి 35, భార్యాభర్తలు, కుటుంబ కలహాలకు సంబంధించినవి 4, కొట్లాటలపై 4, దొంగతనాలపై 3, చిన్న వివాదాలకు సంబంధించి 9, వివిధ మోసాలకు సంబంధించి, మహిళా సంబంధిత నేరాలపై ఒక్కొక్కటి చొప్పున ఫిర్యాదులు అందినట్లు డీసీపీ ఉదయరాణి తెలిపారు.