అర్జీలు పునరావృతం కాకుండా చూడాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీలు పునరావృతం కాకుండా చూడాలి

Aug 19 2025 6:42 AM | Updated on Aug 19 2025 6:42 AM

అర్జీలు పునరావృతం కాకుండా చూడాలి

అర్జీలు పునరావృతం కాకుండా చూడాలి

పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌ డాక్టర్‌ లక్ష్మీశ

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి స్వీకరించే అర్జీలు పునరావృతం కాకుండా చూడాలని, నిర్ధిష్ట సమయంలో నాణ్యతతో వాటికి పరిష్కారం చూపాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమం సోమవారం జరిగింది. జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ లక్ష్మీశ, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియ, పలువురు అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ లక్ష్మీశ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో మంచి ఫలితాలు సాధించాలని అధికారులకు సూచించారు. ప్రజా సమస్యలకు సంబంధించిన అర్జీలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని ఆదేశించారు. నిర్ధిష్ట గడువులోగా ఆ అర్జీలను పరిష్కరించేందుకు బృంద స్ఫూర్తితో పనిచేయాలని స్పష్టంచేశారు. ప్రభుత్వ సేవలపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించేలా నిబద్ధతతో, అర్జీల పరిష్కారానికి కృషిచేయాలని కలెక్టర్‌ లక్ష్మీశ సూచించారు. అర్జీల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రూపంలోనూ నిర్లక్ష్యం, కనిపించకూడదని స్పష్టం చేశారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారంచూపితే ఆ అర్జీలు పునరావృతం కావని పేర్కొన్నారు. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

పీజీఆర్‌ఎస్‌కు 93 అర్జీలు

ప్రజా సమస్యల పరిష్కారవేదిక కార్యక్రమంలో మొత్తం 93 అర్జీలు అందాయని కలెక్టర్‌ జి.లక్ష్మీశ తెలిపారు. అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 25 అర్జీలు అందాయి. మిగిలిన అర్జీలు ఆయా శాఖల వారీగా అందాయి. ఎంఏయూడీకు సంబంధించి 13, విద్య 10, పోలీస్‌ శాఖకు 9, హెల్త్‌ 7, ఇరిగేషన్‌ 4, విభిన్న ప్రతిభావంతులు 3, డీఆర్‌ డీఏ 3, ఇంటర్మీడియెట్‌ విద్య 3, పంచాయతీ రాజ్‌ 3, విద్యుత్‌ 2, పౌరసరఫరాలు 2, బ్యాంకు సేవలు 2 అర్జీలు వచ్చాయి. వ్యవసాయం, కళాశాల విద్య, ఎండోమెంట్‌, హౌసింగ్‌, మార్కెటింగ్‌, రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌, రహదారులు భవనాలు (ఆర్‌ అండ్‌ బీ) శాఖలకు సంబంధించి ఒక్కో అర్జీ చొప్పున వచ్చాయి. ఈ కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, గ్రామ/వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, కేఆర్‌సీసీ స్పెషల్‌ డెప్యూటీ కలెక్టర్‌ ఎ.పోసిబాబు, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

పంట తీసుకెళ్లి డబ్బులు ఇవ్వడం లేదు

జి.కొండూరు మండలం వెలగలేరు పరిసర గ్రామాల రైతులు ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన హైబ్రీడ్‌ విత్తనాల కోసం పంట సాగు చేశారు. కంపెనీ నిబఽంధనల మేరకు పంట పండించారు. కమీషన్‌ బ్రోకర్ల మాటలు నమ్మి పండిన పంటను అదే కంపెనీకి విక్రయించారు. రైతులకు రావాల్సిన డబ్బులు రెండు మూడు రోజుల్లో చెల్లిస్తామని చెప్పి నమ్మబలికారు. రైతులకు చెక్కులు ఇచ్చారు. నాలుగు నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వలేదు. రైతులకు రూ.20 లక్షల వరకు రావాల్సి ఉందని తాడేపల్లికి చెందిన జమలయ్య పలువురు బాధిత రైతులతో కలిసి జేసీకి వినతి పత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement