
అధికారుల పనితీరు భేష్
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లా అధికా రుల పనితీరు భేష్ అని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అభినందించారు. వారి సమష్టి కృషితోనే మెగా ఈవెంట్లను విజయవంతంగా నిర్వహించగలి గామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమల్లో ఉత్తమ ఫలితాల సాధనకు సమర్థవంతమైన అధికారులు, సిబ్బంది పాత్ర కీలకమని పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి విధి నిర్వహ ణలో ఉత్తమ పనితీరు కనబరిచిన 376 మంది అధికారులు, సిబ్బంది, పోలీసు అధికారులకు ప్రశంసాపత్రాలను సోమ వారం అందజేశారు. మున్ముందు ఇదే స్ఫూర్తితో పనిచేసి జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావా లని కలెక్టర్ ఆకాంక్షించారు. అవార్డులు అందుకున్న ప్రతిఒక్కరికీ అభినందనలు తెలిపారు. జిల్లా సమగ్రాభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, సిబ్బందితో పాటు స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, కళాకారులు ఇలా ప్రతిఒక్కరి భాగస్వామ్యం ఉందని, వారి సేవలను గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
అవార్డుల ప్రదానం
కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్‌ఎం, విజయవాడ, నందిగామ, తిరువూరు ఆర్డీఓలు కావూరి చైతన్య, కె.బాలకృష్ణ, కె.మాధురికి ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం శాఖల వారీగా అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం పాల్గొన్నారు.