
ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వరస సెలవుల నేపథ్యంలో ఆదివారం ఇంద్రకీలాద్రికి భక్తుల రద్దీ కొనసాగింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వాతావరణం చల్లగా ఉండటం, చిరు జల్లులు కురుస్తుండటంతో అమ్మవారి దర్శనం అనంతరం భక్తులు ఆలయ ప్రాంగణంలోనే సేద తీరారు. ఖడ్గమాలార్చన, శ్రీచక్రనవార్చన, లక్ష కుంకుమార్చన, శ్రావణ మాస ప్రత్యేక కుంకుమార్చనతో పాటు చండీహోమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఉదయం 10 గంటల నుంచి అంతరాలయ, వీఐపీ టికెట్ల విక్రయాలను నిలిపివేశారు. రూ. 300 టికెటు కొనుగోలు చేసిన భక్తులకు బంగారు వాకిలి దర్శనం కల్పించారు. మధ్యాహ్నం అమ్మవారికి మహా నివేదన అనంతరం భక్తుల రద్దీ మరింత పెరిగింది. భక్తులు ఇబ్బంది పడకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. దుర్గమ్మ దర్శనానంతరం భక్తులు మహా మండపంలో అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. సాయంత్రం అమ్మవారికి జరిగిన పంచహారతుల సేవలోనూ భక్తులు విశేషంగా పాల్గొన్నారు.
సూర్యోపాసనసేవ
లోక కల్యాణార్థం, సర్వ మానవాళి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఆదివారం ఇంద్రకీలాద్రిపై దు ర్గమ్మ సన్నిధిలో సూర్యభగవానుడికి ప్రత్యేక పూజ లు చేశారు. ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద సూర్య భగవానుడి చిత్రపటానికి అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సూర్యనమస్కారాలు, సూర్యోపాసన సేవలో ఉభయదాతలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ