
ఫ్లడ్ రెస్పాన్స్ టీంలు అప్రమత్తంగా ఉండాలి
భవానీపురం(విజయవాడపశ్చిమ): రానున్న రెండు మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉండటంతో నగరపాలక సంస్థ పరిధిలోని వరద ముంపు ప్రాంతాల్లో ఫ్లడ్ రెస్పాన్స్ టీంలు ముందు జాగ్రత్తగా అక్కడ మూడు షిప్ట్‌లలో అందుబాటులో ఉండాలని మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన రామలింగేశ్వరనగర్‌లోని సాయిరామ్ కట్ పీసెస్ వీధి చివరన ఉన్న రిటైనింగ్ వాల్ వద్ద ఫ్లడ్ యాక్షన్ ప్లాన్‌లో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. వరద ముంపు ప్రాంతాల్లో టీంలు అందుబాటులో ఉండటంతోపాటు మిషనరీని కూడా సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో చీఫ్ ఇంజినీర్ ఆర్.శ్రీనాథ్‌రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ కె.సంజయ్ రత్నకుమార్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సామ్రాజ్యం పాల్గొన్నారు.
విజయపురిసౌత్: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునకొండను ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తుండటంతో ఆంధ్ర, తెలంగాణనుంచి పర్యాటకులు నాగార్జునసాగర్ చేరుకొని స్థానిక లాంచీస్టేషన్ నుంచి నాగార్జునకొండకు నాగసిరి లాంచీ, శాంతిసిరి లాంచీలలో వెళ్లారు. అక్కడి చారిత్రక ప్రదేశాలను సందర్శించారు. పచ్చని కొండల మధ్య ఉన్న అనుపులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, యాంపీ స్టేడియం, శ్రీ రంగనాథస్వామి దేవాలయాలను సందర్శించారు. ఎత్తిపోతల జలపాతాన్ని తిలకించారు.