
కోరిన వరాలిచ్చే వరలక్ష్మిగా..
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కోరిన వరములిచ్చే వరలక్ష్మిగా ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చింది. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. మరో వైపు పవిత్రోత్సవాల నేపథ్యంలో శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లతో పాటు ఇతర ఉపాలయాల్లో దేవతా మూర్తులకు పవిత్రాలను అలంకరించారు. ఉదయం 9.20 గంటలకు అమ్మవారి దర్శనం ప్రారంభం కాగా భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ అధికారులు టికెట్ల విక్రయాలను నిలిపివేశారు. ఆన్ లైన్‌లో రూ.500 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మాత్రం అంతరాలయ దర్శనం కల్పించారు. బంగారు వాకిలితో పాటు మొత్తం 5 క్యూలైన్ల ద్వారా భక్తులకు ఉచితంగా అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించారు.
అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకరణ...
పవిత్రోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషేకం, విశేష అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం దుర్గగుడి ఈవో శీనానాయక్ దంపతులతో పాటు పలువురు ఆలయ అధికారులు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. శ్రావణ మాసం వరలక్ష్మీ వ్రతాలను పురస్క రించుకుని అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఆలయ ప్రవేశ మార్గాలలో వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ ప్రాంగణంలో మామిడి తోరణాలు, అరటి చెట్లతో అలంకరించడంతో పండుగ వాతావరణం కనిపించింది. క్యూ లైన్‌లో వేచి ఉన్న భక్తులకు దేవస్థానం మజ్జిగ పంపిణీ చేసింది. రాత్రి 7 గంటల నుంచి భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది.
ఘనంగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు...
శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో పవిత్రోత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించగా, ఆలయ ఈవో శీనానాయక్ దంపతులు పవిత్రాలను సమ ర్పించి పూజల్లో పాల్గొన్నారు. అనంతరం వేద మంత్రోచ్చారణ మధ్య పవిత్రమాలలను అమ్మవారితో పాటు మల్లేశ్వర స్వామి వారికి, ఉపాలయాల్లో దేవతా మూర్తులకు ఆలయ అర్చకులు అలంకరించారు. మూడు రోజుల పాటు నిర్వహించే పవిత్రోత్సవాలు ఆదివారం ఉదయం పూర్ణాహుతితో ముగుస్తాయని ఆలయ అర్చకులు పేర్కొన్నారు.
అమ్మవారి దర్శనానికి తరలివచ్చిన భక్తజనం భక్తులతో కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి రద్దీ సమయంలో టికెట్ల విక్రయాలు రద్దు అన్ని క్యూలైన్లలోనూ ఉచితమే