
పొంగిన వాగులు..
రాకపోకలకు అంతరాయం
పెనుగంచిప్రోలు: పెనుగంచిప్రోలు మండలంలో గురువారం కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. లింగగూడెం వద్ద గండివాగు పొంగడంతో రాకపోకలు నిలిచి పోయాయి. ముచ్చింతాల–తాళ్లూరు మధ్య, పెనుగంచిప్రోలు–అనిగండ్లపాడు మధ్య కూచివాగు, గుమ్మడిదుర్రు వద్ద వాగు పొంగడంతో చప్టాలపై పెద్ద ఎత్తున నీరు చేరి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. పక్కన ఉన్న పొలాలు నీట మునిగాయి. పెనుగంచిప్రోలు చెరువు నిండి అలుగుల నుంచి పెద్ద ఎత్తున జలపాతంలా నీరు ప్రవహిస్తూ రోడ్డుపైకి చేరింది. దీంతో పెనుగంచిప్రోలు–సుబ్బాయిగూడెం రోడ్డు వరద నీటికి కొట్టుకు పోయింది. చెరువు అలుగు కాలువ పూడి పోవడంతో నీరు మొత్తం నాట్లు వేసిన పొలాలపై ప్రవహించింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు వాగుల వద్ద రాకపోకలు నిలిచి పోయాయి. పత్తి సాగు చేసిన పొలాల్లో వర్షం నీరు చేరి తటాకాలుగా మారాయి.

పొంగిన వాగులు..