
సాక్షి, విజయవాడ: చిన్నారి శ్రావణి కిడ్నాప్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ముక్కుపచ్చలారని మూడేళ్ల శ్రావణిని రూ.5 వేలకు అమ్మేసిన కసాయి తండ్రి మస్తాన్.. బిక్షాటన చేయించే ముఠాకు చిన్నారిని విక్రయించాడు. కేసు వివరాలను జీఆర్పీ సీఐ డీవీ రమణ మీడియాకు వెల్లడించారు. బెజవాడ రైల్వే స్టేషన్‌లో ఈ అనూహ్యమైన ఘటన జరిగింది. పోలీసుల విచారణ కిడ్నాప్ డ్రామా బయటపడింది.
గంటల వ్యవధిలోనే శ్రావణి కేసును పోలీసులు ఛేదించారు. శ్రావణినీ కొనుగోలు చేసి తీసుకెళ్తున్న నిందితులను అత్యంత చాకచక్యంగా పోలీసులు పట్టుకున్నారు. శ్రావణిని నిందితులు రాజమహేంద్రవరం తరలిస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. శ్రావణి విక్రయం వ్యవహారంలో ఇద్దరు నిందితులు పాల్గొనట్టుగా పోలీసులు నిర్థారించారు. పాప శ్రావణిని తల్లి సైకం వెంకటేశ్వరమ్మకు రైల్వే పోలీసులు అప్పజెప్పారు. నిందితుడు సైకం మస్తాన్‌రావుకి గతంలో నేర చరిత్ర ఉండడంతో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.