చట్టపరిధిలో ప్రతి సమస్యకు పరిష్కారం
● యనమలకుదురు నుంచి ఒక మహిళ వచ్చి తన భర్త 2014లో మరణించగా అత్త ఇంట్లోనే తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నానని, అయితే తనను ఆడపడుచు, ఆమె భర్త హింసిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కొంతకాలం కిందట అత్త కూడా కాలం చేయటంతో ఆడపడుచు ఆమె భర్త కలిసి పిల్లలతో సహా తనను ఇంటి నుంచి గెంటి వేశారంటూ వాపోయింది. తనకు న్యాయం చేయాలని విన్నవించుకుంది.
● మచిలీపట్నంకు చెందిన మరో మహిళ వచ్చి తనకు చల్లపల్లి మండలానికి చెందిన వ్యక్తితో వివాహం కాగా ఆడపిల్ల పుట్టినట్లు తెలిపింది. అయితే ఆడపిల్ల పుట్టిందనే కారణంతో తనను రెండు సంవత్సరాలుగా పుట్టింటి వద్దనే ఉంచి మానసికంగా వేదనకు గురి చేస్తున్నారంటూ కన్నీరు పెట్టుకుంది. తనకు న్యాయం చేయాలని అర్జీ సమర్పించింది.
● బంటుమిల్లికి చెందిన ఒక వ్యక్తి వచ్చి తాను ఉంటున్న ఇంటి సరిహద్దుదారుడు అతని కొడుకు కలిసి పాత గొడవల నేపథ్యంలో తనను తన కుటుంబాన్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ చెప్పాడు. తమపై దాడికి దిగుతూ, చంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని వారి నుంచి తమ కుటుంబానికి రక్షణ కల్పించి న్యాయం చేయాలని అడిషనల్ ఎస్పీని కోరాడు.
● కానూరుకు చెందిన ఓ బాధితురాలు భర్త మరణించటంతో కుటుంబ పోషణ నిమిత్తం ఆటో కన్సల్టెన్సీ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలిపింది. వ్యాపారం నిమిత్తం పరిచయస్తుల వద్ద కొంత నగదు రుణంగా తీసుకున్నానని, అయితే అప్పు ఇచ్చిన ముగ్గురు వ్యాపారులు అధిక వడ్డీలు కట్టించుకుంటూ తనను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయింది. వారి నుంచి రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరింది.
ఏఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ
కోనేరుసెంటర్: సమస్యల పరిష్కారానికి చక్కటి వేదిక ‘మీ కోసం’ అని ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి. సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని స్పందన హాలులో జరిగిన ‘మీ కోసం’లో పాల్గొన్న ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ‘మీ కోసం’లో అందిన ప్రతి అర్జీని చట్టపరిధిలో విచారణ జరిపించి పరిష్కార చర్యలు తీసుకుంటామన్నారు. మొత్తం 45 అర్జీలు అందినట్లు ఆయన తెలిపారు.
వచ్చిన అర్జీల్లో కొన్ని..