రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీకాంతంకు అవార్డు
పటమట(విజయవాడతూర్పు): ఉమ్మడి కృష్ణాజిల్లాకు కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బి. లక్ష్మీకాంతం నేపాల్‌లోని ఖాట్మాండులో వరల్డ్ కాన్ఫరెన్స్ కౌన్సిల్ నుంచి ఎస్‌డీఈ చాంపియన్ బహుమతిని అందుకున్నారు. ఈ నెల 28వ జరిగిన ఈ కార్యక్రమంలో నేపాల్ మాజీ ఎన్నికల కమిషనర్, మాజీ రాయబారి డాక్టర్ రాంభక్త ఠాకూర్, మాజీ పర్యాటక మంత్రి యాంకిల షెర్పా, మాజీ మహిళా, శిశు సంక్షేమ మంత్రి భగవతి చౌదరి, నేపాల్ మాజీ సంస్కృతి, పౌర విమానయాన మంత్రి ఆనంద ప్రసాద్ పోఖారెల్ సమక్షంలో ఈ అవార్డును ఆయన అందుకున్నారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో యూరియా అక్రమ రవాణా, నిల్వలు, పక్కదారి మళ్లింపులను అరికట్టేందుకు అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద పటిష్ట నిఘా వ్యవస్థను అమలు చేస్తున్నామని, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంటుందని కలెక్టర్ జి.లక్ష్మీశ చెప్పారు. జిల్లాలో యూరియా పంపిణీ ప్రణాళిక, పక్కదారి పట్టకుండా తీసుకుంటున్న చర్యలు, రైతులకు నాణ్యమైన సేవలు అందించడంపై కలెక్టర్ సోమవారం ఆర్‌డీవోలు, వ్యవసాయ, రెవెన్యూ, పోలీసు తదితర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
లైసెన్స్ రద్దు..
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లాలో అక్టోబర్ నుంచి మొత్తం 17,707 టన్నుల యూరియా విక్రయాలు జరిగాయన్నారు. వచ్చే మూడు రోజులకు 339 టన్నుల యూరియా అవసరం కాగా.. ప్రస్తుతం 5,236 టన్నుల యూరియా కోఆపరేటివ్ సొసైటీల్లో, మార్క్‌ఫెడ్ గోదాముల్లో, రిటైల్/హోల్‌సేల్ తదితరాల చోట్ల అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. జిల్లాలో ఎక్కడా ఎరువుల కొరత లేదని, రైతులు ఎరువులను కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా డీలరు నుంచి రసీదు పొందాలని సూచించారు. డీలర్లు నిబంధనలు ఉల్లంఘించినా, కృత్రిమ కొరత సృష్టించినా, పక్కదారి పట్టించినా, ఎంఆర్‌పీ ధరల కంటే అధిక ధరలకు విక్రయించినా వారి లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ట్రస్ట్ బోర్డు సమావేశం జనవరి 5వ తేదీ సోమవారం నిర్వహించేందుకు ఆలయ అధికారులు నిర్ణయించారు. బ్రాహ్మణవీధిలోని దేవస్థానానికి చెందిన జమ్మిదొడ్డి ఆవరణ బోర్డు మీటింగ్ హాల్‌లో ఉదయం 11 గంటలకు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ అధ్యక్షతన ఆలయ ఈవో, ట్రస్ట్‌బోర్డు సభ్యులతో పాటు ఆలయ ఇంజినీరింగ్ అధికారులు, ఏఈవోలు పాల్గొననున్నారు.
రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీకాంతంకు అవార్డు


