నీటి సమస్య పరిష్కారానికే జలశక్తి హ్యాక్‌థాన్
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ డైరెక్టర్ వైఆర్‌ఎస్ రావు
పెనమలూరు: జల సమస్యల పరిష్కారాలను కనుగొని, నూతన సాంకేతికతతో నీటి నిర్వహణను మెరుగుపర్చడమే జలశక్తి హ్యాక్‌థాన్–2025 ముఖ్య ఉద్దేశమని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ డైరెక్టర్ డాక్టర్ వైఆర్‌ఎస్ రావు తెలిపారు. కానూరు సిద్ధార్థ డీమ్డ్ టుబీ యూనివర్సీటీలో సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం జలశక్తి మంత్రిత్వ శాఖ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సస్, రివర్ డెవల్‌మెంట్ శాఖల సహకారంతో జలశక్తి హ్యాకథాన్–2025ను నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వైఆర్‌ఎస్ రావు మాట్లాడుతూ నీటి సమస్యలు గుర్తిస్తే వెంటనే పది లైన్లతో జలశక్తి మంత్రిత్వ శాఖ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
సాంకేతికతతో అధిగమించగలం..
ఆర్‌టీజీఎస్ సీఈవో ప్రఖర్‌జైన్ మాట్లాడుతూ దేశంలో వనరులు తక్కువగా ఉన్నా సాంకేతికతతో సమస్యను అధిగమించగలుగుతామని అన్నారు. విద్యార్థులు పరిశోధనలు చేసి వాస్తవ సమస్యలకు గుర్తించి పరిష్కారం చేయాలని సూచించారు. సెంట్రల్ వాటర్ బోర్డు రీజనల్ డైరెక్టర్ ఎన్.జ్యోతికుమార్ మాట్లాడుతూ మన దేశంలో ఆకలి నుంచి హరిత విప్లవం పైపునకు సివిల్ ఇంజినీర్లు తీసుకు వెళ్లారన్నారు. జాతీయ నీటి నిపుణుడు ఎ.వరప్రసాదరావు, శాస్త్రవేత్త డాక్టర్ ఎస్‌వీ విజయ్‌కుమార్, కానూరు సిద్ధార్థ డీమ్డ్ టుబీ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, వర్సిటీ సివిల్ హెడ్ డాక్టర్ వి.మల్లికార్జున, భూగర్భశాఖ నిపుణులు, సివిల్ ఇంజినీరింగ్ నిపుణులు, విద్యార్థులు పాల్గొన్నారు.


