
11 నుంచి ఆహ్వాన క్రీడా పోటీలు
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు):సిద్ధార్థ అకాడమీ స్వర్ణోత్సవం సంవత్సర సందర్భంగా ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు ఆలిండియా ఇన్విటేషనల్ టోర్నమెంట్స్ (ఆహ్వాన క్రీడా పోటీలు)ను తమ కళాశాల ఆవరణ మైదానంలో నిర్వహిస్తున్నామని సిద్ధార్థ అకాడమీ అకడమిక్ అడ్వైజర్ ఎల్‌కే మోహనరావు చెప్పారు. సిద్ధార్థ కళాశాల ఆవరణలోని సెమినార్ హాలులో టోర్నమెంట్స్‌కు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ శుక్రవారం జరిగింది. మోహనరావు మాట్లాడుతూ ఈ నెల 11 నుండి 14 వరకు వాలీబాల్ (సీ్త్ర, పురుష జట్లు) ఇన్విటేషనల్ టోర్నమెంట్స్ జరుగుతాయని చెప్పారు. ఈ టోర్నమెంట్‌లో కేరళ, మద్రాస్, కోయంబత్తూరు, గుజరాత్, ఆంధ్రపదేశ్ టీమ్‌లు తలపడతాయని పేర్కొన్నారు. ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు బాస్కెట్‌బాల్ (పురుషులు) టోర్నమెంట్ ఉంటుందన్నారు. ఈ టోర్నమెంట్‌లో చైన్నె, బెంగళూరు, కేరళ, తమిళనాడు, ఏపీ టీమ్‌లు పోటీ పడనున్నాయని వెల్లడించారు. 11వ తేదీ మధ్యాహ్నాం టోర్నమెంట్స్ ప్రారంభ సభ నిర్వహిస్తామన్నారు. కళాశాల డైరెక్టర్ వేమూరి బాబూరావు, కళాశాల ప్రిన్సిపాల్స్ మేకా రమేష్ మాట్లాడుతూ నగరంలోని క్రీడాకారులు, క్రీడాభిమానులతో పాటుగా విద్యార్థులు కూడా ఈ టోర్నమెంట్స్‌ను వీక్షించవచ్చునన్నారు. సిద్ధార్థ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ చుండి వెంకటేశ్వర్లు, శాప్ పూర్వ అధ్యక్షుడు అంకమ్మచౌదరి, సిద్ధార్థ కళాశాల క్రీడా విభాగాధిపతి టీ.బాలకృష్ణారెడ్డి, ఉపాధి కల్పనాధికారి కావూరి శ్రీధర్, వ్యాయామ అధ్యాపకులు పాల్గొన్నారు.