పటమట(విజయవాడతూర్పు): నగరవాసులపై చెత్త పోటు పడనుంది. విజయవాడలో మళ్లీ కూటమి పెద్దలు పాతపద్ధతిలో పారిశుద్ధ్య విధానాన్ని అమలు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్(ఆర్‌డబ్ల్యూఎ)లతో 50 శాతం కాంట్రిబ్యూషన్‌తో ఎంవోయూ(మెమెరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్) చేయడానికి పకడ్బందీగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు వీఎంసీ ప్రజారోగ్య విభాగం ఆధ్వర్యాన ఈ నెల 6వ తేదీన వీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉన్న నూతన భవనం సమావేశ మందిరంలో స్కూళ్లు, కాలేజీలు, రెస్టారెంట్లు, ఆర్‌డబ్ల్యూఏలు, బార్‌లు, మాంసం దుకాణాల యజమానులు, హోటళ్లు తదితర వ్యాపార సంస్థలతో సమావేశం నిర్వహించారు. దీని ప్రధాన ఉద్దేశం నగరవాసుల నుంచి 2014–19లో కూటమి ప్రభుత్వం పాలనలో మాదిరి మళ్లీ ఇంటింటి చెత్తసేకరణకు 50శాతం కాంట్రిబ్యూషన్ పేరుతో పన్నును వసూళ్లు చేయడమే.
1204 మైక్రోపాకెట్లు
విజయవాడలో ఇంటింటి చెత్తసేకరణకు వీఎంసీ డివిజన్లు, ఏరియాల వాకీగా 1204 మైక్రోపాకెట్లు ఏర్పాటు చేసింది. 300 కుటుంబాలను ఒక మైక్రోపాకెట్‌గా నిర్ధారించారు. సుమారు 300 కుటుంబాల చొప్పున కార్మికులు/కార్మికురాలు ఇంటికి వెళ్లి ప్రతినిత్యం చెత్తను సేకరించడం, వాటిని గార్జేజ్ లోడర్‌పాయింట్‌కు అక్కడి నుంచి గార్బేజ్ ట్రాన్స్‌ఫర్‌స్టేషన్‌కు వాహనాల్లో తరలించేవారు. దీనికి పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చే వేతనాన్ని 50 శాతం వీఎంసీ, 50 శాతం రెసిడెన్షియల్ వేల్ఫెర్ అసోసియేషన్లు, బల్క్ వేస్ట్ జనరేటర్స్, వివిధ వ్యాపారాలు చేసేవారు చెల్లించాలి. ప్రతినెలా కార్మికుల వేతనాలను కాలనీ పెద్దలు, వ్యాపారస్తులు వీఎంసీకి జతచేసిన తర్వాతే కార్మికులకు వేతనాలను అందించేవారు. ఒక్కో కాలనీకి సుమారు 4 నుంచి 15 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తారు. అయితే కాంట్రిబ్యూషన్ సరిగా జరగకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడ్డారు. మళ్లీ ఇలాంటి కాంట్రీబ్యూషన్ విధానాన్ని వీఎంసీ అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది.
నాడు వైఎస్సార్ సీపీపై దుష్ప్రచారం.. నేడు ప్రజలపై భారానికి కూటమి సిద్ధం
చెత్త తరలింపు ప్రక్రియను నాడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. సచివాలయ వ్యవస్థతో నగరంలోని కుటుంబాలను మ్యాపింగ్‌చేసి క్లాప్(క్లీన్ ఆంధ్రప్రదేశ్) ద్వారా ఇంటింటి చెత్తసేకరణ చేసి డంపింగ్‌యార్డుకు వెళ్లడానికి పకడ్బందీగా అమలుచేసింది. నాడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులను ఆప్కాస్ (ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్‌సోర్సింగ్ సర్వీసెస్) కిందకు తీసుకువచ్చి వారి వేతనాలను ఠంచనుగా అందించింది. ఇంటింటి చెత్త సేకరణకు యూజర్ చార్జీలు స్లమ్ ఏరియాలో నెలకు రూ. 30, కామన్ ఏరియాల్లో అయితే నెలకు రూ.50 వసూలు చేసేవారు. దీనిపై కూటమి నాయకులు నగరవాసుల నుంచి ప్రభుత్వం చెత్త పన్నంటూ దుష్ప్రచారం చేసింది. తాము అధికారంలోకి వస్తే చెత్త పన్నును రద్దుచేస్తామని ప్రకటించిన వారు ఇప్పుడే అదే విధానాన్ని నగరవాసులపై రుద్దుతున్నారు.
నగరంలో మొత్తం 3.70 లక్షల అసెస్‌మెంట్లు
నగరంలో 3.70లక్షల అసెస్‌మెంట్ల నుంచి ప్రతినిత్యం 550–650 మెట్రిక్‌టన్నుల చెత్త ఉత్పత్తవుతుంది. దీనికోసం 3500 మంది పైచిలుకు కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. మూడు నియోజకవర్గాల పరిధిలో 111 నోటిఫైడ్ స్లమ్‌ఏరియాలు ఉన్నాయి. అత్యధికంగా కొండప్రాంతాలు, అజిత్‌సింగ్‌నగర, కృష్ణలంక, పటమట, భవానీపురం, పాయకాపురం, కండ్రిక, ఒన్‌న్‌టౌన్‌లో స్లమ్ ఏరియాలు నమోదయ్యాయి. కొండప్రాంతాల్లో సుమారు లక్షన్నరమంది జనాభా, మిగిలిన స్లమ్ ఏరియాల్లో నాలుగు ఐదు లక్షలకుపైగా నివాసాలుంటున్నారు. నగరంలోని నోటిఫైడ్ కాలనీలు సుమారు 250 కాలనీలు ఉన్నాయి. వాటిలో స్లమ్‌ఏరియాల్లోనే అత్యధికంగా 150 వరకు కాలనీలు ఉన్నాయి. ఆ కాలనీల్లో ఉండేవారికి, కొండప్రాంతాల్లో ఉండేవారికి ఇప్పుడు కాంట్రిబ్యూషన్ విధానం ఆర్థిక భారమవుతుంది.
కాలనీల్లో పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పూర్వ విధానంలో చెల్లించడానికి చర్యలు వీఎంసీలో చెత్తసేకరణకు ఆర్‌డబ్ల్యూఏల నుంచి 50 శాతం కాంట్రిబ్యూషన్ పద్ధతి విజయవాడలో 2014–19లో ఇదే విధానాన్ని అమలు చేసిన కూటమి నాడు వైఎస్సార్ సీపీపై కూటమి దుష్ప్రచారం
చెత్తసేకరణ సక్రమంగా జరగడం లేదు
కాలనీల్లో చెత్తసేకరణ కూడా సక్రమంగా జరగడం లేదు. గతంలో ఇంటింటికీ చెత్తసేకరణకు ఆటోలు వచ్చేవి. ఇప్పుడు సమయ పాలనలేదు. వచ్చినా కాలనీల్లో కొన్ని ఇళ్ల నుంచి మాత్రమే సేకరించి వెళ్లిపోతున్నారు. అదేమంటే మొన్నటివరకు కార్మికులు స్ట్రైక్ చేస్తున్నారని, ఇప్పుడేమో తక్కువగా వస్తున్నారని కారణాలు చెబుతున్నారు. మళ్లీ ఇప్పుడు కాలనీ వాసులే కాంట్రిబ్యూషన్ చేయాలనడం శోచనీయం.
– శ్రీలక్ష్మీ, పటమట
నగరంపై చెత్తపోటు!
నగరంపై చెత్తపోటు!