
సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాల అమలుకు నోచుకోలేదని ఇఫ్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. రామకృష్ణ అన్నారు. సంక్షేమ బోర్డును అమలు చేయాలని కోరుతూ ఈ నెల 19న మహాధర్నా జరుగుతుందన్నారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏపీ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్, ఇఫ్టూఆధ్వర్యంలో మహాధర్నాకు సంబంధించిన వాల్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా భవన నిర్మాణ సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తామని, సంక్షేమ పథకాలు అందడానికి చర్యలు తీసుకుంటామని కూటమి ప్రకటించిందన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేశారని తెలిపారు. రాష్ట్రంలో 36 లక్షల మంది భవన నిర్మాణ రంగంలో పని చేస్తున్నారని ప్రభుత్వమే ప్రకటించిందన్నారు. పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో ‘నా వంతు కర్తవ్యంగా కోటి రూపాయలు సంక్షేమ బోర్డుకి’ విరాళం ఇస్తున్నానని ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత విస్మరించడం కార్మికులను మోసం చేయడమేనని మండి పడ్డారు. కార్యక్రమంలో బీసీడబ్ల్యూ రాష్ట్ర నేతలు జి. హరికృష్ణరెడ్డి, షేక్ మీరావలి, సుబ్బారావు, వెంకటేశ్వరరావు, ఆసియా బేగం, కనకారావు, మధు, కలాం, అల్లూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు
19న విజయవాడలో మహా ధర్నా ఇఫ్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రామకృష్ణ