
తండ్రే సూత్రధారి
కేసు ఛేదించిన రైల్వే పోలీసులు
రూ.5 వేలకు బాలికను భిక్షాటనకు విక్రయం
తండ్రితో పాటు మరో ఇద్దరు నిందితుల అరెస్టు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): వ్యసనాలకు బానిసైన భర్త.. భార్యకు తెలియకుండా మూడేళ్ల కూతురును అపహరించి సహజీవనం చేస్తున్న ఒక జంటకు విక్రయించాడు.. తర్వాత ఏం తెలియనట్లుగా విజయవాడ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో అసలు నిందితుడు తండ్రే అని పోలీసులు నిగ్గు తేల్చారు. ఈ మేరకు విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ) ఇన్‌స్పెక్టర్ జె.వి.రమణ, ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ ఫతేఆలీబేగ్‌లు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
బాపట్ల జిల్లా వేటపాలెం గ్రామానికి చెందిన సైకం మస్తాన్, వెంకటేశ్వరమ్మ భార్యాభర్తలు. వీరికి ఏడుగురు సంతానం. చెడు వ్యసనాలకు బానిసైన భర్త తరచూ భార్యతో గొడవలు పడుతుండేవాడు. నాలుగు నెలల క్రితం కుటుంబంలో గొడవలు జరగటంతో భార్య పిల్లలతో కలసి భర్తకు వేటపాలంలోనే దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో ఈ నెల 6న సైకం మస్తాన్ భార్య ఇంటికి వెళ్లి ఆమెకు తెలియకుండా తన ఏడో సంతానం మూడేళ్ల శ్రావణిని తీసుకుని విజయవాడలో విక్రయించడానికి ప్రయతి్నస్తున్నాడు.
భిక్షాటన చేయించేందుకు చిన్నారిని కొనుగోలు చేసిన జంట
విజయవాడ రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫాంపై మజ్జిగ ప్యాకెట్‌లు విక్రయిస్తున్న ప్రకాశం జిల్లా వేమవవరానికి చెందిన బొల్లా శ్రీనివాసులు, స్టేషన్ పరిసరాల్లో భిక్షాటన చేసుకుంటున్న సడేల చిన్నారి సహజీవనం చేస్తున్నారు. ఈ నెల 7న విజయవాడ స్టేషన్‌లో వారిని సైకం మస్తాన్ పరిచయం చేసుకుని తన బిడ్డను విక్రయిస్తానని తెలపడంతో ఆ చిన్నారితో భిక్షాటన చేయిస్తూ ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆలోచించారు.
వారు రూ.5 వేలు ఇచ్చి చిన్నారిని కొనుగోలు చేసుకున్నారు. విజయవాడలోనే ఉంటే బాలిక ఆచూకీ తెలిసిపోతుందని భావించిన వారు రాజమండ్రిలో బాలికతో భిక్షాటన చేయించడానికి తీసుకువెళ్లారు. అనంతరం ఎక్కడ తనపై అనుమానం వస్తుందోనని తండ్రి మస్తాన్ ఏంతెలియనట్లుగా అదే రోజు రాత్రి 10.30 గంటలకు తన బిడ్డను ఎవరో కిడ్నాప్ చేశారని ఒకసారి, రిజర్వేషన్ కౌంటర్ వద్ద తప్పిపోయిందని పొంతన లేకుండా జీఆర్పీ పోలీసులకు తెలిపాడు.
ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన జీఆర్పీ
తండ్రి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు తల్లి లేకుండా మూడేళ్ల బిడ్డతో ఎందుకు వచ్చావని విచారణ చేయగా ఒకసారి భార్య చనిపోయిందని, మరోసారి ఆమె వదిలేసి వెళ్లిపోయిందని చెప్పాడు. పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తల్లి ఆచూకీ తెలుసుకుని ఆమెను పిలిపించారు. ఆర్‌పీఎఫ్ సహకారంతో స్టేషన్‌లోని సీసీ కెమేరాలను పరిశీలించిన పోలీసులు.. నిందితులు బాలికను తీసుకువెళ్తున్నట్లు గుర్తించారు. బస్‌స్టేషన్‌లోని సీసీ కెమేరాలను పరిశీలించగా విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్లే బస్సు ఎక్కినట్లు గుర్తించి డ్రైవర్ నంబర్ తెలుసుకుని ఫోన్ చేసి అనుమానితుల వివరాలు చెప్పడంతో బాలికను తీసుకుని ఒక మహిళ, పురుషుడు బస్సులో ప్రయాణిస్తున్నట్లు తెలుసుకున్నారు.
రాజమండ్రి జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించి వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు అక్కడకు చేరుకుని బాలికతో పాటు ఇద్దరు నిందితులను విజయవాడ తీసుకువచ్చి బాలికను తల్లికి అప్పగించారు. తండ్రితో పాటు బాలికను కొనుగోలు చేసిన నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.