పారదర్శకంగా అర్జీల పరిష్కారం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమానికి వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, పారదర్శకంగా పరిష్కారం చూపాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పీజీఆర్‌ఎస్ కార్యక్రమం జరిగింది. డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి తదితరులతో కలిసి కలెక్టర్ లక్ష్మీశ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చే అర్జీలను గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. అర్జీల పరిష్కారంలో అర్జీదారుని సంతృప్తి ప్రధానమని పేర్కొన్నారు. జిల్లాస్థాయి అధికారులు పీజీఆర్‌ఎస్ అర్జీలను త్వరితగతిన పరిష్కరించేందుకు వీలుగా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి అధికారులతో ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.
అర్జీల వివరాలు ఇవి..
కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు మొత్తం 117 అర్జీలు అందాయని కలెక్టర్ తెలిపారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి అత్యధికంగా 41 అర్జీలు ఉన్నాయి. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి 24, పోలీస్ శాఖకు 13, పంచాయతీరాజ్ శాఖకు 7 అర్జీలు అందాయి. డీసీహెచ్‌ఎస్, గృహ నిర్మాణం, లీడ్ బ్యాంక్ మేనేజర్‌కు 3 చొప్పున, ఏపీఎస్‌ఆర్‌టీసీ, డీఆర్‌డీఏ, ఉపాధికల్పన, ఇరిగేషన్, సాంఘిక సంక్షేమ శాఖలకు రెండు చొప్పున అర్జీలు వచ్చాయి. అదేవిధంగా వ్యవసాయం, ఏపీ ట్రాన్స్‌కో, ఆప్కాస్, బీసీ కార్పొరేషన్, పౌర సరఫరాలు, కోఆపరేటివ్ సొసైటీ, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం, దేవదాయ శాఖ, మత్స్య, అటవీ, గనులు, నైపుణ్యాభివృద్ధి, సర్వే విభాగాలకు ఒక్కొక్కటి చొప్పున అర్జీలు వచ్చాయి.
వచ్చిన అర్జీల్లో కొన్ని..
● మిల్క్‌ప్రాజెక్ట్ సాయిరాం థియేటర్ ప్రాంతానికి చెందిన అజ్గర్ ఆలీ(10) పుట్టుకతో వికలాంగుడు. 90 శాతం వైకల్యంతో బాధపడుతున్నాడు. ప్రభుత్వం నుంచి సదరం సర్టిఫికెట్ అందుకున్నాడు. కానీ అతనికి పెన్షన్ రావడం లేదు. దీంతో అజ్గర్ ఆలీ తల్లిదండ్రులు షేక్ బాబు, మాబు సుభాని దంపతులు పీజీఆర్ ఎస్‌లో అర్జీ సమర్పించారు.
● నగరంతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగిస్తున్న బార్ల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్య ప్రతినిధులు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
● న్యూ ఆర్‌ఆర్ పేట ప్రాంతంలో నివసిస్తున్న యానాది కుటుంబాల్లోని పిల్లలకు ఆధార్ కార్డులు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్, బర్త్ సర్టిఫికెట్లు జారీ చేయాలని డీవీఆర్‌సీ ఎన్‌జీవో సంస్థ అర్జీ సమర్పించింది.
కలెక్టరేట్‌లో జరిగిన పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్ లక్ష్మీశ ప్రజల నుంచి 117 అర్జీలు స్వీకరణ


