పమిడిముక్కలలో నేలవాలిన వరి చేను
అన్నదాతల్లో
రెండు రోజులు గడిస్తే చాలు..!
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మిచాంగ్ తుపాను నేపథ్యంలో పంటలకు నష్టం జరగకుండా రైతులు రెండు, మూడు రోజులు వరి కోతలను వాయిదా వేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు సూచించారు. ఇప్పటికే కోత కోసి న ధాన్యాన్ని లారీల్లో మిల్లులకు తరలించేలా రైతులను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. తుపాను హెచ్చరికల దృష్ట్యా కలెక్టర్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ పి.సంపత్ కుమార్ ఆదివారం అఽధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తుపాను దృష్ట్యా జిల్లాలో వరి పండించిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందస్తు జాగ్రత్త చర్యలు సత్వరమే చేపట్టాలన్నారు. వర్షాలకు ధాన్యం తడిసి దెబ్బతిని రైతులు నష్టపోకూడదని స్పష్టం చేశారు. తడిసి దెబ్బ తిని తేమ శాతం ఉన్నా ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగొలు చేసి రైతులను ఆదుకుంటామన్నారు. ఆర్డీవోలు, తహసీల్దార్లు, వ్యవసాయ అధికారులు, కస్టోడియన్ అధికారులు తప్పకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులు వరి కోతలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వరి కోసి సిద్ధంగా ఉన్న ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాలు, మిల్లులకు తరలించేలా పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.
కంకిపాడు: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయు గుండం మిచాంగ్ తుపానుగా మారిందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో రెండు రోజులుగా కృష్ణా జిల్లాలో వాతావరణం పూర్తిగా మారింది. ఉదయం పొడిగా ఉన్నా.. మధ్యాహ్నం నుంచి మబ్బులు కమ్మి గాలులు వీస్తున్నాయి.
ఇప్పటి వరకూ జిల్లాలో ఎక్కడా చిరు జల్లులు మినహా మోస్తరు వర్షం లేదు. వీస్తున్న గాలులకు పెనమలూరు, పామర్రు, గన్నవరం నియోజకవర్గాల్లో పలు చోట్ల కోతకు సిద్ధంగా ఉంచిన వరి చేలు నేలవాలాయి.
రైతులు ఉరుకులు, పరుగులు
జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో 3.69 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. 317 కొనుగోలు కేంద్రాలను రైతులకు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 87 కేంద్రాలకు పైగా కొనుగోళ్లు మొదలయ్యాయి. జిల్లాలో ఇప్పటికే 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి మిల్లులకు తరలించారు. వాతావరణ పరిస్థితులు మారడంతో మూడు రోజులుగా రైతులు వరి కోత యంత్రాలతో కోత కోయించి ధాన్యాన్ని రోడ్లపైకి చేర్చుకున్నారు. ఆర్‌బీకేల ద్వారా పంటను మిల్లులకు తరలించడానికి త్వరపడుతున్నారు. రోడ్లపై ధాన్యం ఆరబోసి కాటా వేసే పనిలో ఉన్నారు. ధాన్యం బస్తాలను లారీల్లో మిల్లులకు తరలించటం, వర్షానికి తడవకుండా సురక్షితంగా ఉండే ప్రాంతాలకు తీసుకెళ్లే పనుల్లో నిమగ్నమయ్యారు. ఆరబోసిన ధాన్యం రాశులపై పరదాలు కప్పి, పనల మీద ఉన్న పంటను కుప్పలు వేసుకుంటున్నారు.
అండగా అధికార యంత్రాంగం
మబ్బులు కమ్మడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా యంత్రాంగం రైతులకు బాసటగా నిలిచింది. ఇప్పటికే ధాన్యం సేకరణలో ఉన్న తేమశాతం, వాహనాలకు జీపీఎస్ అమరిక నిబంధనలను సడలించింది. ఆన్‌లైన్‌తో పాటుగా ఆఫ్‌లైన్‌లోనూ ధాన్యం సేకరించి మిల్లులకు తరలిస్తున్నారు. జిల్లాలో ఆఫ్‌లైన్ విధానంలో 10 వేల మెట్రిక్ టన్నులను ఈ రెండు రోజుల్లో తరలించారు. రైతుల వద్ద ఉన్న 25 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తడవకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అవసరమైన సూచనలు, సహకారాన్ని రైతులకు జిల్లా రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అందిస్తున్నాయి.
కలవరం
జిల్లాలో చాలా చోట్ల వరి కోతలు సాగుతున్నాయి. ధాన్యం రాశులు రోడ్లపై ఉన్నాయి. కూలీలతో కోత కోయించి పనలు పొలాల్లో ఉంచారు. మిచాంగ్ తుపాను ప్రభావంతో భారీ వర్షం కురిస్తే పనలు తడిసిపోతాయని, కోతకు సిద్ధంగా ఉన్న వరి చేలు నేలవాలి పంటకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
మిచాంగ్ తుపానుతో అలజడి వీస్తున్న గాలులకు నేలవాలిన వరి చేలు అధికారులు అప్రమత్తం ఆగమేఘాల మీద మిల్లులకు ధాన్యం తరలింపు
చోడవరం సమీపంలో ధాన్యాన్ని ఆరబోస్తున్న దృశ్యం


