అమెరికన్ల పేర్లు, ఇంటిపేర్ల కథ.. కమామీషు ! | Sakshi
Sakshi News home page

అమెరికన్ల పేర్లు, ఇంటిపేర్ల కథ.. కమామీషు !

Published Mon, May 6 2024 4:05 PM

Where Do American Peoples Surnames Come From

పుట్టిన ప్రతి మనిషికి ఏదో ఒక పేరు ( Name ) పెట్టడం సహజం. అవి వాళ్ళు పూజించే కులదైవం, పూర్వీకులు, ప్రముఖులు ఎవరివైనా కావచ్చు. ఇవి చాలవన్నట్లు వారి రంగు రూపు రేఖా విలాసాలను బట్టి ఏదో ఒకటి జత చేసి పిలుస్తుంటారు. ఒక ఊరిలో ఎల్లయ్య, మల్లయ్య, రామయ్య, సోమయ్యలు ఎందరో ఉండొచ్చు. వాళ్ళను గుర్తు పట్టడానికి ఉపయోగపడేవి ఇంటిపేర్లు ( Surnames ). ఇవి సాధారణంగా వాళ్ళ వాళ్ళ వంశాన్ని, వృత్తిని బట్టి, నివసించే పరిసరాలు, వలస వచ్చిన ప్రాంతాలను బట్టి రకరకాలుగా వస్తుంటాయి, మన దేశంలోనే కాదు బయట కూడా. తెలుగు వారికి ఇంటిపేరు ముందు అసలు పేరు తర్వాత వస్తుంది. ఉత్తరాది ఇందుకు భిన్నం.  ఐతే అమెరికా వంటి దేశాల్లో కూడా ఇదే తీరు

మనలానే పేర్లు వెనుక వృత్తులు..
అమెరికా వంటి బయటి దేశాలకు వెళ్ళాక మనవాళ్ళు కూడా అదే అనుసరిస్తున్నారు. ఇండియాలో ఉన్నప్పుడు ముందు ఇంటి పేరు ఉంటుంది, అమెరికాకు వెళ్లగానే మన వాళ్లు ఇంటి పేరును వెనక్కి నెట్టేస్తారు. నేను అమెరికా వెళ్లిన ప్రతిసారి అక్కడి వారి పేర్లు, ఇంటిపేర్ల సమాచారం మా పిల్లలు, కుటుంబ మిత్రులను అడిగి తెలుసుకుంటుంటాను . అమెరికాలో మనం వినే చాలా పేర్ల వెనక మనలాగే వృత్తులు (చేసే పని) ముడిపడి ఉంటాయి. అలాగే వారి వంశానికి సంబంధించిన ఇతివృత్తానికి ముడిపడి ఉంటాయి. 

ఉదాహారణకు స్మిత్ ( Smith ), గోల్డ్ స్మిత్ ( Gold smith ), బట్లర్ ( Butler ), కుక్ ( Cook ), టైలర్ ( Tailor ), టర్నర్ ( Turner ) వంటివి వృత్తి పరమైన పేర్లు. అలాగే కిమ్ ( Kim ) బంగారు పనిచేసే కొరియా వారు , కిండర్‌మన్ ( Kindermann ) అంటే ఉపాధ్యాయుడు, గాగ్నెక్స్ ( Gagneux ) అంటే ఫ్రెంచ్ రైతు, సెటిల్‌మైర్‌ ( Tenant farmer - German ) అంటే జర్మన్‌లో కౌలుదారు కూడా అలాంటివే. ఇక మరికొన్ని ఎక్కడి నుంచి వచ్చారన్నదానికి ముడిపడి ఉంటాయి. రామోస్ ( Ramos ) హిస్పానిక్ పేరు, గోల్మన్ ( Gole man ) తూర్పు జర్మనీ ప్రాంతాన్ని బట్టి, పెర్రీ ( పెర్రీ ) ఆంగ్ల పియర్ చెట్టు దగ్గరి నివాసి, రివేరా ( Rivera ) హిస్పానిక్ నది ఒడ్డు నివాసి, టోర్రెస్ ( Torres ) స్పానీష్ టవర్ దగ్గరి నివాసి వంటివి పరిసరాలను బట్టి వచ్చిన పేర్లు. వాషింగ్టన్ ఒక సెటిల్మెంట్ పేరు. 

మనిషిని బట్టి వచ్చే పేర్లు..
ఇక మనిషిని చూడగానే కొట్టొచ్చినట్టు కనిపించే లక్షణాన్ని బట్టి మరికొందరి పేర్లు వచ్చాయి. గ్రే ( Gray ) బూడిద రంగు జుట్టున్న వ్యక్తి , వైట్ ( White ) తెల్ల జుట్టున్న వ్యక్తి, బ్రౌన్ ( Brown ) వంటివి వాళ్ళ జాతిని బట్టి వచ్చినవి. సమాజంలో బాగా బతికిన వాళ్లకు సంబంధించిన వాళ్ల పిల్లలు తమ తాత ముత్తాతల పేర్లు కలిసి వచ్చేట్టు పేర్లు కూడా పెట్టుకుంటారు. డేవిస్ ( Davis ) అంటే డేవిస్ కుమారుడు అని వాళ్ళ తండ్రిని బట్టి వచ్చిన పేరు. అలాంటివే జాన్సన్ ( Johnson ),ప్యాటర్సన్ ( Patterson ), నెల్సన్ ( Nelson ), రాబిన్సన్ ( Robinson ) వంటివి. మన దగ్గర తండ్రి పేర్లు ఉంటాయి.

సినీ తారలు కూడా..
అలాగే తల్లిప్రేమ కూడా కొందరిలో కనిపిస్తుంది గౌతమీపుత్ర శాతకర్ణి లాగా. దేశం ఏదైనా, మతం ఏదైనా ఆస్తికులు అన్ని చోట్లా ఉంటారు. దేవుడి పేరును తమ పేరులో పెట్టుకుంటారు. హేస్ ( Hayes ), హ్యూస్ ( Hughes ) ఐరిష్ దేవుడి పేర్లు. అలాంటిదే మార్టిన్ ( Mortin రోమన్ దేవుడు ) కూడా. మర్ఫి (Murphy ), ఫిలిప్స్ ( Phillips ) మనం ఎప్పుడో వాడి మూలకు పడేసిన రేడియో పేర్లు వాళ్లకు మాత్రం గొప్ప బలవంతులు. ఇక సినిమా నటుల సంగతి దగ్గరకుస్తే.. హాలీవుడ్ అయినా బాలీవుడ్, టాలీవుడ్ వారైనా చాలామంది తమ అసలు పేర్లు మొత్తానికే మార్చుకోవడం తెలిసిందే కదా . అలాంటిదే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న అభిమాన తార, ఫ్యాషన్ ఐకాన్ మెరిలిన్ మన్రో ( Marilin Monroe ), ఆమె గారి అసలు పేరు మాత్రం నోరు తిరగని నోర్మా మార్టెన్సన్ !. 
--వేముల ప్రభాకర్‌

(చదవండి: అమెరికాలో పెళ్లిళ్లు పెటాకులు !)

Advertisement
 
Advertisement