పిట్స్‌బర్గ్‌లో వైకుంఠ ఏకాదశి వేడుకలు! | Vaikuntha Ekadashi Celebrations At Sri Venkateswara Temple In America Pittsburgh, Pics Goes Viral - Sakshi
Sakshi News home page

పిట్స్‌బర్గ్‌లో వైకుంఠ ఏకాదశి వేడుకలు!

Published Sun, Dec 24 2023 2:05 PM

Vaikuntha Ekadashi Celebrations At Sri Venkateswara Temple In Pittsburgh - Sakshi

అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం పిట్స్‌బర్గ్‌లో వెలసిన శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవోపేతంగా జరిగాయి. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో వేద మంత్ర పఠనం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఇక ఉదయం నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుని పునీతులౌతున్నారు.

ఈ సందర్భంగా భక్తులు గోవింద నామస్మరణతో దేవస్థాన ప్రాంగణం ప్రతిధ్వనించింది. వైకుంఠ ఏకాదశి విశిష్టత గురించి అర్చక స్వాములు వివరించారు. ఈ సందర్భంగా ఆలయంలో అఖండ పారాయణం, అష్టోత్తర శతనామ అర్చనలు, శ్రీ వైకుంఠ గద్యం, అష్టాక్షరీ మహామంత్ర జపాలు నిర్వహించినట్లు వివరించారు. తిరుపతి వెళ్లలేని భక్తులు అమెరికాలో తొలి దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన పిట్స్‌బర్గ్‌లో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని శ్రీవారి కృపకు పాత్రులు అవుతున్నారని తెలిపారు.

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని లోకం సుభిక్షంగా ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలు, భోగ భాగ్యాలతో వర్ధిల్లాలని స్వామి వారిని ప్రార్థించినట్లు అర్చక స్వాములు వివరించారు. ఇక భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గత 48 సంవత్సరాలుగా ఆలయంలో వేడుకలు, ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం సభ్యులు తెలిపారు. వైకుంఠ ఏకాదశి వేడుకలు దిగ్విజయంగా కొనసాగటం పట్ల నిర్వహకులతో పాటు భక్తులు తమ ఆనందం వ్యక్తం చేశారు.

(చదవండి: షార్జాలో ఘనంగా సీఎం జగన్‌ జన్మదిన వేడుకలు!)

Advertisement
 

తప్పక చదవండి

Advertisement