
చంద్రమౌళి నాగమల్లయ్య ఉదంతం మరువక ముందే.. అమెరికాలో భారత సంతతి ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. పెన్సిల్వేనియాలో ఓ మోటల్ మేనేజర్‌గా పని చేస్తున్న రాకేశ్ ఇహగబన్(51)ను ఓ దుండగుడు కాల్చి చంపేశాడు. తన మోటల్ బయట జరుగుతున్న గొడవను ఆపేందుకు వెళ్లిన క్రమంలోనే ఆయన అనూహ్యంగా ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. అసలేం జరిగిందంటే..
పెన్సిల్వేనియా స్టేట్ పిట్స్‌బర్గ్‌లో ఉన్న ఓ మోటల్‌లో రాకేశ్ ఇహబగన్(Rakesh Ehagaban) మేనేజర్‌గా పని చేస్తున్నారు. అక్టోబర్ 3వ తేదీన(శుక్రవారం) మధ్యాహ్నా సమయంలో మోటల్ బయట పార్కింగ్ వద్ద ఏదో అలజడి వినిపించింది. బయటకు వెళ్లిన ఆయనకు.. ఓ వ్యక్తి తన దగ్గర ఉన్న గన్‌తో ఓ మహిళపై కాల్పులకు దిగడం కనిపించింది. అయితే ఆ సమయంలో ఆ వ్యక్తిని ‘‘ఆర్ యూ ఆల్‌రైట్ బడ్’’ అంటూ రాకేష్ పలకరించాడు. అంతే తన చేతిలో గన్‌ను రాకేష్ వైపు తిప్పి పాయింట్ బ్లాక్ రేంజ్‌లో షూట్ చేశాడు ఆ దుండగుడు.
బుల్లెట్ గాయాలతో అక్కడికక్కడే కుప్పకూలి రాకేష్ మరణించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. పారిపోతున్న నిందితుడిపై కాల్పులు జరిపి పట్టుకున్నారు. ఈ కాల్పుల్లో నిందితుడితో పాటు ఓ పోలీస్ అధికారి సైతం గాయపడ్డారు. నిందితుడిని స్టాన్లీ వెస్ట్‌గా(38) నిర్ధారించిన పోలీసులు.. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.
పోలీసులు తెలిపిన అదనపు వివరాల ప్రకారం.. స్టాన్లీ వెస్ట్ గత రెండు వారాలుగా రాకేష్ మేనేజర్‌గా పని చేస్తున్న పిట్స్‌బర్గ్ మోటల్‌లోనే ఉంటున్నాడు. పార్కింగ్ వద్ద అతను కాల్పులు జరిపిన మహిళ కూడా అతనితోనే అక్కడే ఉంటోంది(ఓ చంటి బిడ్డతో సహా). అయితే శుక్రవారం ఏదో గొడవ జరిగి ఆమె వెళ్లిపోతుంటే.. స్టాన్లీ ఆమెపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఆమె మెడలో తూటా దిగి తీవ్రంగా గాయపడింది. వెనక సీటులో ఉన్నా ఆమె బిడ్డకు అదృష్టవశాత్తూ ఏం కాలేదు. రక్తస్రావం అవుతుండగానే.. ఆమె తన వాహనాన్ని తీసుకుని కొద్దిదూరం పారిపోయింది. తర్వాత ఆమెను గుర్తించిన పోలీసులు.. ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఆమె స్పృహలోకి వస్తేనే ఏం జరిగిందనేది తెలుస్తుందని కేసు దర్యాప్తు చేస్తున్న రాబిన్‌సన్ టౌన్‌షిప్ పోలీసులు చెబుతున్నారు. అయితే.. ఏం సంబంధం లేకుండా గొడవను ఆపేందుకు వెళ్లి భారత సంతతికి చెందిన రాకేశ్ ఇహగబన్ ప్రాణాలు పొగొట్టుకున్నారని వెల్లడించారు.
సెప్టెంబర్ 10వ తేదీన.. అమెరికా టెక్సాస్ స్టేట్ డల్లాస్ నగరంలోని ఓ మోటల్ మేనేజర్ అయిన చంద్రమౌళి నాగమల్లయ్య(50)ను అక్కడ పని చేసే.. యోర్డాన్స్ కోబోస్ కత్తితో తల నరికి హత్య చేసిన ఘటన తెలిసిందే. గదిని శుభ్రం చేసే మెషీన్ విషయంలో చిన్నపాటి గొడవకే ఆగ్రహంతో ఊగిపోయి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు కోబోస్. ఈ దారుణం మల్లయ్య భార్య, కుమారుడి కళ్ల ముందే జరగడం గమనార్హం. తల నరికి.. దానిని కాలితో తన్ని.. ఆపై చెత్త బుట్టలో వేసిన దృశ్యాలు కలవరపాటుకు గురి చేశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.