
కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుక సంబరాలు అంబరాన్నంటాయి. శుక్రవారం రోజున బండి సంజయ్ కుమార్ పుట్టినరోజును పురస్కరించుకొని లండన్ ఇల్ఫార్డ్‌లోని బీజేపీ శ్రేణులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, కేక్ కటింగ్, స్వీట్లు, పంపిణి మొక్కలు నాటడంతో పాటు పలు సేవా కార్యక్రమాలను భారీ ఎత్తున చేపట్టారు.
బీజేపీ లండన్ అధ్వర్యంలో ఇల్ఫార్డ్ లోని బండి సంజయ్ జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి, స్వీట్లు, పూల మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాటిపల్లి సచిందర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ క్షేత్రస్థాయిలో దిగ్విజయనేత అని కొనియాడారు. కార్పొరేటర్ నుండి ఎంపీ, కేంద్రమంత్రి స్థాయికి బండి సంజయ్ ఎదిగిన తీరు కార్యకర్తలకు ఆదర్శం, స్ఫూర్తిదాయకమన్నారు. సరస్వతీ శిశు మందిరం లో విద్యనభ్యసించిన బండి సంజయ్ కుమార్ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారని అన్నారు.
ఆర్ఎస్ఎస్‌లో ఘటన్ నాయక్ గా, ముఖ్య శిక్షక్ గా ప్రాథమిక విద్యా స్థాయిలోనే బండి సంజయ్ పని చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనంతరం అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో, బిజెపి కరీంనగర్ పట్టణ ఉపాధ్యక్షుడిగా, అధ్యక్షులుగా, జిల్లా , రాష్ట్ర కార్యవర్గాల్లో వివిధ హోదాల్లో బిజెపిలో ఆయన బాధ్యతలు నిర్వర్తించారని తెలిపారు. భారతీయ జనతా పార్టీ కేరళ, తమిళనాడు రాష్ట్రాల ఇన్చార్జిగా ను ఆయన పని చేశారని, ఎల్కే అద్వానీ చేపట్టిన రథయాత్రలోనూ బండి సంజయ్ కుమార్ భాగం పంచుకున్నారని , 35 రోజులపాటు దేశవ్యాప్తంగా జరిగిన ప్రచారంలో పాల్గొన్నారని తెలిపారు. 1994 _ 2003 మధ్యకాలంలో బండి సంజయ్ కుమార్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా పని చేశారన్నారు.
2005లో కరీంనగర్ 48వ డివిజన్ నుండి కార్పొరేటర్‌గా బండి సంజయ్ విజయం సాధించారని, వరుసగా మూడుసార్లు ఆయన కార్పొరేటర్ గా గెలుపొందారన్నారు.2019 లో కరీంనగర్ పార్లమెంటు సభ్యులుగా ఎన్నికయ్యారని తెలిపారు. అనంతరం బిజెపి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ కుమార్ పార్టీని బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేశారని తెలిపారు. ఆయన సారాధ్యంలో బిజెపి రాష్ట్రంలో పుంజుకుందన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో తెలంగాణ వ్యాప్తంగా బండి సంజయ్ కుమార్ చేపట్టిన పాదయాత్రతో బీజేపీ గ్రామ గ్రామానికి చేరిందని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమై, వారి కష్ట సుఖాలు తెలుసుకుంటూ, అధికార పార్టీపై తీవ్రస్థాయిలో బండి సంజయ్ కుమార్ విరుచుకుపడ్డారని తెలిపారు.
బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో రాష్ట్రంలో జరిగిన దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలు జిహెచ్ఎంసి ఎన్నికలు చరిత్ర సృష్టించాయన్నారు. బండి సంజయ్ దిశా నిర్దేశంలో రాష్ట్రంలో బిజెపి గ్రాఫ్ పెరిగిందన్నారు. అనంతరం బండి సంజయ్ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారని తెలిపారు. కరీంనగర్ చరిత్రలోనే భారీ మెజారిటీతో రెండోసారి బండి సంజయ్ పార్లమెంట్ సభ్యునిగా గెలుపొంది, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారని తెలిపారు. ప్రస్తుతం దేశ, రాష్ట్ర బిజెపి కీలక నేతల్లో బండి సంజయ్ ఒకరని చెప్పారు.
ప్రధానంగా కరీంనగర్ పార్లమెంటు సర్వతో ముఖాభివృద్ధి కోసం బండి సంజయ్ కుమార్ అహర్నిశలు కృషి చేస్తున్నారని, రెండు టర్ములలో పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక మెజారిటి తో గెలుపొంది రాష్ట్ర బిజెపి అధ్యక్షునిగా పనిచేసి కేంద్రమంత్రి గా కొనసాగుతూ స్థానికంగా ప్రజలకి అందుబాటులో ఉంటున్నారని కొనియాడారు ఈ కార్యక్రమం లోఓవర్సీస్ బీజేపీ నాయకులు వాస భరత్, బండ సంతోష్, కోమటిరెడ్డి శివ ప్రసాద్ రెడ్డి, జయంత్, సంజయ్, బద్దం చిన్న రెడ్డి, సురేష్, చార్లెస్, జేమ్స్, ఆంథోనీ తదితరులు పాల్గొన్నారు.