తూర్పు తీరంలో వెల్లివిరిసిన ‘ తెలుగు రేఖలు’

Telugu Book Release Toorpu Teeram lo Telugu Rekhalu - Sakshi

ప్రపంచానికి తూర్పు వైపున ఉన్న ఆస్ట్రేలియాలో వైభవోపేతంగా తెలుగు వెలుగులీనుతోంది. ఆరు దశాబ్దాలుగా ఆ దేశంలో నివసిస్తున్న తెలుగు ప్రజలు తెలుగు భాషా,సాహిత్యాలను, తెలుగు వారి అస్తిత్వాన్ని, తెలుగు సంస్కృతిని సమున్నతంగా చాటుతున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టిపెరిగిన వారు ఎందరో ప్రముఖులు తమ మేధాసంపత్తితో, ప్రతిభాపాటవాలతో ఆస్ట్రేలియా సామాజిక జీవితాన్ని ప్రభావితం చేస్తున్నారు. విశ్వవిపణిపైన తెలుగు కీర్తి బావుటాను ఎగురవేస్తున్నారు.సరిగ్గా 60 ఏళ్ల క్రితం మన తెలుగు వాళ్లు ఆస్ట్రేలియాకు వలస వెళ్లారు.

ఎన్నో కష్టాలను,బాధలను అనుభవించారు. కానీ ఆ ఆరవై ఏళ్లల్లో వందలు, వేలు,లక్షలుగా తెలుగు వారి ప్రస్తానం సాగింది. ఆస్ట్రేలియాదేశంలోనే మన భాషకు ఒక సామాజిక గుర్తింపు, హోదా లభించాయి. ఈ 60 ఏళ్ల పరిణామాలపైన ప్రముఖ రచయిత, మెల్‌బోర్న్‌లో నివసిస్తున్న కొంచాడ మల్లికేశ్వరరావు రచించిన అద్భుతమైన పుస్తకం ‘తూర్పు తీరంలో తెలుగు రేఖలు’. ఈ పుస్తకం ఆస్ట్రేలియాలో 60 ఏళ్ల తెలుగు వైభవాన్ని సమున్నతంగా ఆవిష్కరించింది. మొదటి తరం అనుభవించిన కష్టాలను మొదలుకొని నేటి తరం  చేరుకున్న ఉన్నతమైన విజయ శిఖరాల వరకు సమగ్రంగా చర్చించింది.

మల్లికేశ్వరరావు గత రెండు, మూడు దశాబ్దాలుగా ఆస్ట్రేలియాలో తెలుగుభాష అభివృద్ధి కోసం విశేషకృషి చేస్తున్నారు. భువనవిజయం వంటి సాంస్కృతిక సంస్థలను స్థాపించి నాటకాలను, కవిసమ్మేళనాలను, సాహిత్య చర్చలను నిర్వహిస్తున్నారు. అలాగే తెలుగు భాష గుర్తింపు కోసం ఆస్ట్రేలియా కేంద్రప్రభుత్వాన్ని ఒప్పించేందుకు అక్కడి తెలుగు సంఘాలతో కలిసి పని చేశారు.

తెలుగు భాషాసంస్కృతులను ప్రాణప్రదంగా భావించే ఆయన కలం నుంచి జాలువారిన ఈ పుస్తకం ఆస్ట్రేలియాలో అరవై ఏళ్ల తెలుగు వసంతాల ప్రస్తానం. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లంతా చదవదగిన పుస్తకం. అంతేకాదు. ఆస్ట్రేలియాకు వెళ్లే తెలుగువారికి ఈ ‘తూర్పు తీరంలో తెలుగు రేఖలు’ పుస్తకం ఒక కరదీపికగా ఉంటుంది.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top